Begin typing your search above and press return to search.

ఈసీ మాట‌!... దిన‌క‌ర‌న్‌ కు పార్టీనే లేదు!

By:  Tupaki Desk   |   5 Feb 2018 11:30 AM GMT
ఈసీ మాట‌!... దిన‌క‌ర‌న్‌ కు పార్టీనే లేదు!
X
త‌మిళ‌నాట మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ ప‌రిణామంతో చిన్న‌మ్మ వ‌ర్గం దాదాపుగా డ‌మ్మీగా మారిపోయే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ కొత్త ప‌రిణామంతో ఇప్ప‌టిదాకా ఎప్పుడో కూలుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లో కొట్టుమిట్టాడిన ఎడప్పాడి ప‌ళ‌నిసామి ప్ర‌భుత్వం ఇక‌పై ధీమాగానే పాల‌న సాగించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయినా అస‌లు విష‌యం చెప్ప‌కుండా ఈ కొత్త ప‌రిణామం ఏమిటనేగా మీ ప్ర‌శ్న‌? అయితే వివ‌రాల్లోకెళ్లిపోదాం. అన్నాడీఎంకే అధినేత్రి - దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాట ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం చోటుచేసుకుంది. అక్క‌డి రాజ‌కీయం రోజుకో కొత్త మ‌లుపు తీసుకుంటూ దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది కూడా. వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాలతో జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌ - ఆమె వ‌ర్గం మొత్తం పార్టీ నుంచి గెంటివేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. అయితే అదే అక్క‌సుతో ఎడ‌ప్పాడి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి తీర‌తాన‌ని ప్ర‌తిన‌బూనిన శ‌శిక‌ళ అల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్‌... ఏకంగా అన్నాడీఎంకేనే చీర్చేశారు. కొంద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు మ‌రికొంద‌రు పార్టీకి చెందిన కీల‌క నేత‌లు దిన‌క‌ర‌న్ పంచ‌న చేరిపోయారు. దీంతో ఎప్పుడు కుర్చీ దిగాల్సి వ‌స్తోందోన‌ని ఎడ‌ప్పాడి దిన‌దిన‌గండంగానే గ‌డిపారంటే అతిశ‌యోక్తి కాదేమో.

అయితే అంత ప్ర‌మాదం రాలేదు గానీ... అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో మాత్రం ఎడ‌ప్పాడి వ‌ర్గానికి భారీ షాకే త‌గిలింది. అన్నాడీఎంకే (అమ్మ‌) త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌న దిన‌క‌ర‌న్ బంపర్ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ విజ‌యంతో మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగిపోయిన దిన‌క‌ర‌న్‌... త‌మిళ‌నాట త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే (అమ్మ‌) పార్టీ త‌ర‌ఫున అన్ని చోట్లా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించుతామ‌ని, ఆ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి తీర‌తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. అందుక‌నుగుణంగా త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థులందరికీ ఒకే గుర్తు వ‌చ్చేలా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించాల‌ని, ఆ గుర్తుగా... త‌న‌కు ఆర్కే బైపోల్స్‌ లో కేటాయించిన కుక్క‌ర్ గుర్తును కేటాయించాల‌ని ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దిన‌క‌ర‌న్ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు... కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో పాటుగా త‌మిళ‌నాడు సీఎం ఎడ‌ప్పాడి - డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వంకు నోటీసులు జారీ చేసింది.

తాజాగా ఈ పిటిష‌న్‌ పై నేటి ఉద‌యం విచార‌ణ జ‌రిగింది. ఈ విచారణ‌కు హాజ‌రైన కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫు న్యాయ‌వాదులు... దిన‌క‌ర‌న్‌కు మొత్తంగా చిన్న‌మ్మ వ‌ర్గానికి గ‌ట్టి దెబ్బే కొట్టేశారు. దినకరన్ పిటిషన్ కొట్టి వేయాలని ఢిల్లీ హైకోర్టులో ఎన్నికల కమిషన్ మనవి చేసింది. అన్నాడీఎంకే (అమ్మ) అనే పార్టీనే లేదని, అలాంటి పార్టీని భారత ఎన్నికల కమిషన్ గుర్తించలేదని - అలాంటి సమయంలో ఓకే గుర్తు కేటాయించడం ఎలా సాధ్యం అవుతుందోని కమిషన్ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదించారు. ఎన్నికలు జరిగే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారికి గుర్తులు కేటాయిస్తారని, అది మా పరిధిలోకి రాదని, దినకరన్ పిటిషన్ కొట్టి వెయ్యాలని భారత ఎన్నికల కమిషన్ ఢిల్లీ హైకోర్టులో మనవి చేసింది. ఫ‌లితంగా ఎడ‌ప్పాడి స‌ర్కారును దెబ్బ తీద్దామ‌ని క‌త్తులు నూరుతున్న దిన‌క‌ర‌న్‌కు ఆదిలోనే గ‌ట్టి దెబ్బ తగిలింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.