Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డితో కలిసి ఈ దర్శకుడి ప్రచారం

By:  Tupaki Desk   |   5 Dec 2018 12:59 PM IST
కోమటిరెడ్డితో కలిసి ఈ దర్శకుడి ప్రచారం
X
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై సినీతారల సందడి తక్కువగానే ఉంది. టీఆర్ఎస్ పార్టీ మొన్నటివరకు అధికారంలో ఉన్నప్పుడు సినీ పెద్దలు, హీరోలు కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు నెరిపేవారు. కానీ ఎన్నికల వేళ ఎవ్వరూ ఏ పార్టీ తరుఫున చొరవ తీసుకోవడం లేదు.. ఖమ్మంలో పోటీచేస్తున్న నామా నాగేశ్వరరావు తరుఫున ఆయన బావ మరిది హీరో వేణు ప్రచారం చేస్తున్నారు. ఈయన కు ప్రస్తుతం పెద్ద గా గుర్తింపు లేకపోవడంతో ప్రాధాన్యం కరువైంది.

తాజా గా నల్గొండ లో పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరుఫున ఓ టాలీవుడ్ దర్శకుడు ప్రచార పర్వంలోకి దిగారు. ఈయనకు, ఆయనకు ఎక్కడి సంబంధమో తెలియదు కానీ.. కోమటిరెడ్డి గెలవాలంటూ డైరెక్టర్ రవిబాబు నల్గొండలో ప్రచారం చేస్తున్నారు. వెంకటరెడ్డి మంచి మనిషి అంటూ.. ఆయన్ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

రవిబాబు పలు సైంటిఫిక్, హర్రర్ చిత్రాలు తీసి పేరు సంపాదించాడు. ఇటీవల పందిని ప్రధాన పాత్రధారిగా పెట్టి ‘అదుగో’ మూవీ తీశాడు. గడిచిన 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రచార యాడ్స్ ను రూపొందించింది రవిబాబే.. తాజా గా తెలంగాణ ఎన్నికల్లో ఈయన సడన్ గా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి కి మద్దతిచ్చి తిరుగుతున్నారు.

నల్గొండ జిల్లా లో ఈసారి కోమటిరెడ్డి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. బలమైన టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డి కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన కోమటిరెడ్డి.. తన నియోజకవర్గం వదిలి బయటకు రావడం లేదు. తాజాగా సినీ జనాలను తీసుకొచ్చి ఓట్లు సంపాదించేందుకు నడుం బిగించారు.