Begin typing your search above and press return to search.

నిన్న క్విట్‌ - నేడు హ‌ఠావో!.. కోడెల‌కు ఓట‌మేనా?

By:  Tupaki Desk   |   14 March 2019 11:31 AM GMT
నిన్న క్విట్‌ - నేడు హ‌ఠావో!.. కోడెల‌కు ఓట‌మేనా?
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ప‌రిస్థితి ఇప్పుడు పెనంలో నుంచి పొయ్యిలో ప‌డిన చందంగా మారిపోయింది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రావుపేట నుంచి స‌త్తెన‌ప‌ల్లికి మారిన కోడెల... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో చిన్న మార్జిన్ తో బ‌య‌ట‌ప‌డ్డారు. కోడెల దూకుడు వైఖ‌రికి ముకుతాడు వేయాల‌న్న కోణంలో ఆలోచించిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఆయ‌న‌కు కేబినెట్ లో చోటు కాకుండా అసెంబ్లీ స్పీక‌ర్‌గా అవ‌కాశం క‌ల్పించారు. ప‌క్ష‌పాత వైఖ‌రికి ఏమాత్రం తావు లేకుండా వ్య‌వ‌హ‌రించాల్సిన స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోడెల అందుకు విరుద్ధంగానే వ్య‌వ‌హ‌రించార‌ని విపక్షం వైసీపీ ఆరోపించింది. అయినా కూడా కోడెల త‌న వైఖ‌రిని మార్చుకోక‌పోగా... వైసీపీ ఏకంగా అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేసింది.

ఇటు స‌త్తెన‌ప‌ల్లిలో కూడా కోడెల వ‌ర్గం వ్య‌వ‌హార స‌ర‌ళి శృతి మించ‌డంతో అక్క‌డ కూడా ఆయ‌న‌కు అస‌మ్మ‌తి సెగ మొద‌లైపోయింది. ఈ క్ర‌మంలో మొన్న‌టికి మొన్న విప‌క్షాల‌న్నీ క‌లిసి క్విట్ కోడెల‌... సేవ్ స‌త్తెన‌ప‌ల్లి పేరిట ఓ వినూత్న నిర‌స‌న వ్య‌క్తం చేయ‌గా... ఇక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత సొంత పార్టీలోనే ఆయ‌న‌కు అస‌మ్మ‌తి సెగ మొదైపోయింది. ఈ ఎన్నిక‌ల్లో కోడెల‌కు టికెట్ ఇస్తే స‌హించేది లేద‌ని రోడ్డెక్కిన స‌త్తెన‌ప‌ల్లి తెలుగు త‌మ్ముళ్లు,... ఏకంగా కోడెల హ‌ఠావో అంటూ నిన‌దించారు. గ‌డ‌చిన మూడు రోజులుగా ఈ త‌ర‌హా నిర‌స‌న‌లు జ‌రుగుతున్నా... నేడు ఏకంగా కోడెల హ‌ఠావో, స‌త్తెన‌ప‌ల్లి బ‌చావో అంటూ తెలుగు త‌మ్ముళ్లు ఏకంగా ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. దీంతో స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల‌కు బాగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులే నెల‌కొన్నాయ‌ని చెప్ప‌క తప్ప‌దు.

గడ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన అంబ‌టి రాంబాబు.... కోడెలకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఈ క్ర‌మంలో చిన్న మార్జిన్ తో కోడెల బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఈ ద‌ఫా అటు విప‌క్షాల నుంచే కాకుండా ఇటు సొంత ప‌క్షం నుంచి కూడా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కోడెల ఓట‌మి గ్యారెంటీనే అనే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక‌త‌ను ఎదుర్కొంటున్న కోడెల‌కు మంచి ప్ర‌త్య‌ర్థిని వైసీపీ బ‌రిలోకి దించితే... కోడెల ఓట‌మి ఖాయ‌మేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.