Begin typing your search above and press return to search.

జగన్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు.. చివరకు ఏం కానుంది?

By:  Tupaki Desk   |   3 July 2021 2:30 PM GMT
జగన్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు.. చివరకు ఏం కానుంది?
X
రాజకీయ ప్రేరేపిత కేసులు ఎలా ఉంటాయి? రాజకీయంగా తమకు అడ్డుగా ఉన్న వారిని ఎంతలా వేధించొచ్చు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గతంలో నమోదు చేసిన కేసుల్ని ఉదాహరణగా చూపించొచ్చు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుమారుడు వ్యాపారాలు చేయకూడదా? ఒకవేళ చేసినప్పుడు.. అతని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినోళ్లంతా అవినీతిపరులు.. క్విడ్ ప్రో ఒప్పందంలో భాగంగానే ఇన్వెస్టు చేస్తారా? అన్న ప్రశ్నలు పలువురు సంధిస్తుంటారు.

జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా వేధింపులకు గురి చేయటానికి ఎవరేం చేశారో ప్రత్యేకంగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికి ఆ విషయాలు తెలిసినవే. నిజానికి ఆ కారణంతోనే ఆయన మీద అన్నేసి కేసులు ఉన్నప్పటికీ.. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించటం.. ఏకంగా ముఖ్యమంత్రిని చేయటం.. అధికారాన్ని కట్టబెట్టటం లాంటివి చూసినప్పుడు.. జగన్ మీద అవినీతి ఆరోపణల్ని ఏపీ ప్రజలు ఏ మాత్రం నమ్మలేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కోర్టుల విషయాన్ని పక్కన పెడితే.. ప్రజాకోర్టులో ఆయన మీద ఆరోపణల్ని అస్సలు పట్టించుకోమన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పకతప్పదు.

జగన్ మీద పెట్టిన కేసులు.. ఆ సందర్భంగా ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వైనంపై కేసులునమోదు చేసిన తీరును చూసినప్పుడు చాలామందికి చాలానే సందేహాలు కలిగాయి. ముఖ్యమంత్రి కుమారుడుకానీ.. వారి కుటుంబ సభ్యులు చేసే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదా? కీలక పదవుల్లో ఉన్న బంధువులతో వ్యాపారాలు చేస్తే.. అవి లంచాలుగా పరిగణలోకి తీసుకుంటారా? సీఎం కొడుకు కంపెనీల్లో పెట్టుబడి పెడితే.. ప్రభుత్వం నుంచి అనుచిత ప్రయోజనాల్ని పొందటం కోసమేనా? మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టేసి.. పలు మంత్రిత్వ శాఖల్ని నిర్వహించిన నేతల్ని వదిలేసి.. కేవలం కొందరు అధికారుల్ని.. పెట్టుబడి పెట్టిన వారిని మాత్రమే టార్గెట్ చేయటం దేనికి నిదర్శనం? అన్న సందేహాలు చాలామందిలో తలెత్తాయి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 103 మందిని నిందితులుగా పేర్కొనటం తెలిసిందే. వారిలో చాలా మంది దేశ వ్యాప్తంగా పలు పరిశ్రమల్ని నిర్వహిస్తున్న ప్రముఖులు ఉన్నారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కావొచ్చు.. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డితో సహా ఇందూ గ్రూప్ తదితర సంస్థలు చాలానే ఉన్నాయి. ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన మరో అంశం ఉంది. అదేమంటే.. ఏదైనా ఫైల్ మీద అంతిమ సంతకం పెట్టేది ఆయా శాఖల్ని నిర్వహించే మంత్రులే. వారిని వదిలేసి.. ఆ ఫైల్ మూవ్ చేసిన అధికారులపై కేసులు పెట్టటం ఎంతవరకు సబబు? అన్నది కూడా ప్రశ్నే.

జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆయన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా అనుచిత లబ్థి పొందారన్న ఆరోపణలతో కకేసులు నమోదు చేయటం.. నిందితుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తల పేర్లు రావటం తెలిసిందే. దీంతో.. వారంతా కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిగిన వాదనలతో కొందరిని జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారిలో శ్రీనివాసన్ ఒకరు. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంను ఆశ్రయించగా..ఆ తీర్పుపై స్టే రాలేదని చెబుతారు. దీంతో.. ఈ కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు తమ పేర్లను కూడా మినహాయించాలని కోరుతూ డిశ్చార్జి పిటిషన్లు జారీ చేయాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం హెటిరో శ్రీనివాసరెడ్డి పిటీషన్ పై న్యాయ విచారణ జరుగుతోంది. ఇండియా సిమెంట్స్ అధినేత మాదిరే తనను కూడా ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. సీబీఐనమోదు చేసిన కేసుల్లో రాజకీయ అంశాలు ఉన్నాయని.. పెట్టుబడులు పెట్టటం ఎలా తప్పు అవుతుందని ఆయన తరఫు లాయర్లు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. రేపొద్దున ఎవరైనా సీఎం కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేస్తే.. వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం తప్పు అవుతుందా? అని శ్రీనివాసరెడ్డి లాయర్లు వాదించినట్లుగా సమాచారం.

ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు.. ఈ కేసుల్లో ఎవరెవరు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారో తమకు జాబితా ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. వారిపై ఎలాంటి అభియోగాలు మోపారన్నవిషయాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. శ్రీనివాసన్ వాదనను పరిగణలోకి తీసుకొని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్ననిందితుల పేర్లను తొలగిస్తే.. అప్పుడేం అవుతుంది?

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల వాదనలతో కోర్టు ఏకీభవిస్తే.. జగన్ తప్పించి మరెవరూ మిగిలే అవకాశం లేదు. అలాంటప్పుడు ఆరోపణలన్ని రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతున్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి సైతం నిందితుడు అయ్యే అవకాశం ఏముంది? సీబీఐ కోర్టు విచారణకు సంబంధించిన చర్చ ఇలా సాగుతున్నవేళలోనే.. మరో కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటీషన్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి అవసరం ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.