Begin typing your search above and press return to search.

మళ్లీ వివక్ష: కేబినెట్ లో ఏపీని విస్మరించిన మోడీ

By:  Tupaki Desk   |   8 July 2021 8:30 AM GMT
మళ్లీ వివక్ష: కేబినెట్ లో ఏపీని విస్మరించిన మోడీ
X
కేంద్ర కేబినెట్ ను ప్రధాని మోడీ ప్రక్షాళన చేశాడు. సీనియర్లు అయిన 12 మంది సిట్టింగ్ మంత్రులకు సైతం ఉద్వాసన పలికి సంచలనం సృష్టించాడు. 43 మంది కొత్త మంత్రులను చేర్చి తన కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించారు. యువకులు, ఉత్సాహవంతులకు ఈసారి మోడీ తన కేబినెట్ లో చోటు కల్పించాడు.

రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చే ప్రతీసారి కేంద్రంలోని బీజేపీ పాచిక వేస్తుంది. ఆయా రాష్ట్రాలకు పెద్దపీట వేస్తుంది. కోట్ల నిధులను విడుదల చేస్తుంది. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు ఎరవేస్తుంది. అవసరమైతే కేంద్ర కేబినెట్ లోకి చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెడుతుంది. బీజేపీ గద్దెనెక్కినప్పటి నుంచి అలాగే శివసేన, జేడీయూ, అన్నాడీఎంకే, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఇలానే చేర్చుకొని ఆయా రాష్ట్రాల్లో అధికారం కొల్లగొట్టింది.

ఇప్పుడు అదే ఫార్ములాను మళ్లీ తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ప్రజలను దువ్వేపనిలో బీజేపీ పడింది. ఇదివరకు కేంద్ర మంత్రిపదవుల్లో తమకు వాటా సరిగా ఇవ్వలేదన్న రాష్ట్రాలకు ఎన్నికల దృష్ట్యా మోడీ పెద్దపీట వేశారు.

దేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలకు మోడీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. దురదృష్టవశాత్తూ ఏపీకి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించలేదు. కొత్త మంత్రిమండలిలో రాష్ట్రానికి చెందిన ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కలేదు. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలన్నింటికి పెద్దపీట వేసి మంత్రి పదవులు కేటాయించిన మోడీ ఆంధ్రప్రదేశ్ ను మాత్రం విడిచిపెట్టడం ఇక్కడి నేతల్లో నైరాశ్యం నింపినట్టైంది.

నిజానికి విస్తరణ సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావును మోడీ మంత్రివర్గంలో చేర్చుకుంటారనే చర్చ జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏపీలో ప్రస్తుతం ఆయన మాత్రమే సమర్థుడైన నాయకుడిగా ఉన్నారు. ఈయనకు ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని అందరూ ఊహించారు.

అయితే మోడీ మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జీవీఎల్ ను విస్మరించి ఉత్తరప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రానికే చెందిన వారితో కోటాను నింపారు. మోడీ కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. దీంతో జీవీఎల్ కు కేబినెట్ లో చోటు దక్కలేదు.

ఒకవేళ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్డీఏ కూటమిలో చేరడానికి అంగీకరించినట్లైతే వైసీపీ ఎంపీలకు రెండు కేబినెట్ పోస్టులు ఇచ్చేందుకు మోడీ సిద్ధమయ్యారట.. కానీ జగన్ ముందుకు రాకపోవడంతో అదిసాధ్యం కాలేదు. ప్రత్యేక హోదా సహా ఏపీ కి సాయం విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందుకు రాకపోవడంతో అనవసరంగా చేరి ప్రజల దృష్టిలో విలన్లు కావద్దనే జగన్ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. జగన్ తన పార్టీ రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర కేబినెట్ లో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రత్యేక హోదా సహా ఏ విషయంలో మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని.. జగన్ కోరిన పనులు, అభివృద్ధి విషయంలో సాయం చేయడం లేదని జగన్ గుర్రుగా ఉంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా విస్మరిస్తున్న మోడీ కేబినెట్ లో అందుకే చేరకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం కేబినెట్ లోనూ ఏపీని మోడీ పూర్తిగా విస్మరించిన తీరు చూశాక ఇక జగన్ సైతం దూరంగా ఉండాలనే డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. జగన్ మనసులో మార్పు వచ్చి తర్వాత ఎన్డీఏలో చేరితో రెండు కేబినెట్ పదవులు ఇవ్వడానికి మోడీషాలు రెడీగా ఉన్నారు.కానీ ప్రస్తుతానికి మాత్రం జగన్ దూరంగానే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఏపీ ఈ మోడీ కేబినెట్ లో అసలు ప్రాతినిధ్యమే ఉండదని తాజాగా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.