Begin typing your search above and press return to search.

అత్యున్నత పదవిలో ఉన్నా వివక్షే - గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 March 2022 4:26 AM GMT
అత్యున్నత పదవిలో ఉన్నా వివక్షే - గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
X
మహిళలు ప్రతి నిమిషం నూతనోత్సాహంతో ముందుకు సాగాలి.. ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దు.. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడూ ఉండాలి.. ఒక్కోసారి అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదు.. మహిళలు నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతి అడుగు ముందుకు వేయాలని తెలంగాణ గవర్నర్ తమిళ సౌ సౌందరరాజన్ స్పష్టం చేశారు.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె రాజ్ భవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలకు పలు సూచనలను చేశారు. అంతేకాకుండా మహిళలు అత్యున్నత పదవిలో ఉన్నా వివక్షకు గురవుతున్నారని, అందుకు నేనే ఉదాహరణను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మహిళలకు ఇప్పటికీ గౌరవం దక్కడం లేదు, చివరికి అత్యున్నత పదవిలో ఉన్న తాను సైతం వివక్షకు గురయ్యాను. అయితే నన్నెవరు భయపెట్టలేదు. నేను దేనికి భయపడను. తాను సమాన హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. ఏ మహిళా తన స్వార్థం కోంస ఏదీ కోరుకోదు. ప్రతిదీ కుటుంబం కోసమే ఆలోచిస్తుంది. స్త్రీలందరూ ఆర్థిక స్వాలంబన కలిగి ఉండాలి. నిరాశ, నిస్పృహలు కోల్పోకుండా ప్రతి అడుగు నూతనోత్సాహంతో ముందుకు వేయాలి. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. '

'ఇటీవల కొందరు నన్ను తమిళనాడు మహిళలు, తెలంగాణ మహిళలకు తేడా ఏంటని అడిగారు. అయితే మహిళలంతా ఒకేలా ఉంటారు. ప్రాంతాలను భట్టి మనసులు మారవు. తెలంగాణ సోదరిగా ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతో ఇష్టపడుతా. ఇక మహిళలు సాధించాలన్న తపన ఎప్పటికీ కలిగి ఉండాలి. ఒక్కోసారి అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదు. భారతీయ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎవరికీ భయపడకుండా ముందడుగు వేస్తారు. మహిళలను గుర్తించి గౌరవించి, వారి కృషిని, అద్భుత విజయాలను జరుపుకునేందుకు మహిళా దినోత్సవం కావాలి' అని తెలంగాణ గవర్నర్ స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇటీవల గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మహిళ అయినందువల్లే వివక్ష చూపారని విమర్శించారు.

అయితే ప్రభుత్వం మాత్రం గత సమావేశాలకు కొనసాగింపుగానే జరుపుతున్నామని, ఈ సమావేశాలకు ప్రత్యేకంగా గవర్నర్ ప్రసంగం అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా తాను అత్యున్నత పదవిలో ఉన్నా.. వివక్ష చూపారని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం చర్ఛనీయాంశంగా మారింది.