Begin typing your search above and press return to search.

మోదీ షాల గుగ్లీ.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఆయనా?

By:  Tupaki Desk   |   4 March 2022 4:35 AM GMT
మోదీ షాల గుగ్లీ.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఆయనా?
X
ఊహించని నిర్ణయాలు తీసుకొని అందరిని విస్తుపోయేలా చేయటంలో మోడీ షాలు ఎంతటి ఘనాపాఠిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరిన తర్వాత కరోనా కారణంగా రెండేళ్లు ఇట్టే కరిగిపోయాయి. లేకుంటే మరెన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకునేవారో చెప్పలేం. మరోసారి.. మోడీ తన రాజకీయ చతురతను ప్రదర్శించేలా నిర్ణయాన్ని త్వరలో వెల్లడించబోతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రపతిగా ఉన్న రాంనాథ్ కోవింద్ పదవీ కాలం పూర్తి కానుంది. మరి.. ఆయన స్థానంలో తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించనుందన్నది ఇంతకాలం ప్రశ్నగా ఉండేది. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా అభ్యర్థి ఎంపిక దాదాపుగా జరిగిపోయినట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత.. కశ్మీర్ ప్రాంతానికి చెందిన మైనార్టీ నేత.. గులాం నబీ అజాద్ ను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు సంబంధించి వివిధ పార్టీలతో చర్చలు జరిపే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ అధికార పార్టీ వైసీపికి చెందిన ఒక సీనియర్ నేతను ఢిల్లీకి పిలిపించుకున్న అజాద్.. ఆయనతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. తాను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగితే తనకు వైసీపీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చే విషయంపై జగన్ ను ఒప్పించాల్సిందిగా కోరినట్లుగా చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం వచ్చే జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ముస్లిం నేతను అభ్యర్థిగా ఎంపిక చేయటం ద్వారా మైనార్టీ వర్గాలకు మోడీ సర్కారు వ్యతిరేకమన్న ముద్రను తొలిగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అజాద్ ను రంగంలోకి దించితే రాజ్యాంగపరంగా అత్యున్నత పదవి విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించిన ఘనత మోడీకి దక్కటంతో పాటు.. విపక్షాలు ఆత్మరక్షణలో పడేలా చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. 72 సంవత్సరాల గులాం నబీ అజాద్ రాజ్యసభ సభ్యుడిగా గత ఏడాది వరకు ఉన్నారు. ఈ మధ్యనే ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇదొక్కటే కాదు.. గులాం నబీ అజాద్ రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసిన సమయంలో మోడీ ఆయనతో తనకున్న అనుబంధం గురించి తలుచుకొని కంట తడి పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉన్నన్ని రోజులు..సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న అజాద్.. ఆ తర్వాత నుంచి గొంతు మారటం తెలిసిందే. ఈ మధ్యనే పార్టీకి చెందిన 23 మంది కీలక నేతల టీంకు నాయకుడిగా అవతరించిన గులాం నబీ అజాద్.. పార్టీలో సంస్థాగత మార్పులు లేకపోవటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయటం తెలిసిందే. ఇవన్నీ చూసినప్పుడు ఒక క్రమపద్ధతిలో జరిగిన పరిణామాలు గా కనిపిస్తాయి. మరే కాంగ్రెస్ సీనియర్ నేతకు ఇవ్వనంత ప్రాధాన్యతను అజాద్ విషయంలో మోడీ ఇవ్వటం.. ఒకట్రెండు సార్లు ఆయన రాజకీయ అనుభవం గురించి మా గొప్పగా కీర్తించడం కూడా తెలిసిందే.

ఇదంతా కూడా ఒక వ్యూహంలో భాగంగానే జరిగిందా? అన్నదిప్పుడు ప్రశ్న. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. గులాం నబీ అజాద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా మోడీ అండ్ కో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. ఈసారి వేసిన గుగ్లీకి విపక్షాలే కాదు.. మోడీషాలకు వ్యతిరేకంగా జట్టు కట్టాలని సిద్ధమవుతున్న కేసీఆర్ అండ్ కో ఫ్రంట్ సైతం సరేననక తప్పని పరిస్థితి ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.