Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు హైదరాబాద్ లో ఎంతో నష్టం

By:  Tupaki Desk   |   6 Aug 2015 4:46 AM GMT
ఏపీ హైకోర్టు హైదరాబాద్ లో ఎంతో నష్టం
X
ఇష్టానికి వచ్చినట్లు మాట్లాడేయటం టీఆర్ఎస్ నేతలకు అలవాటే. చీకట్లో రాయి విసిరే దానికి అప్ గ్రేడ్ వెర్షన్ గా టీఆర్ఎస్ నేతలు కనిపిస్తారు. తాజాగా.. పార్లమెంటు సమావేశాల్లో వారు చేసిన ఆరోపణే దీనికి నిదర్శనం. ఏపీలో పుట్టి.. పెరిగి.. ఏపీ నుంచి ఇంత స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు ఏ రోజు ఏపీని ఉద్దరిస్తూ మాట్లాడింది లేదు.

చివరకు తాను విపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు.. ఏపీని ముక్కలు చేయటానికే ఆయన మాట్లాడారే తప్పించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. విభజనకు ముందు.. విభజన తర్వాత ఏపీ ప్రయోజనాల గురించి ఆయన పట్టించుకున్న దాఖలాలే కనిపించవు. విభజన బిల్లు సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడి.. నాటి ప్రధాని మన్మోహన్ నుంచి లోక్ సభలో హామీ పొందిన వెంకయ్య.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. దాన్ని ఏ విధంగా తూచ్ అన్నారో చూసిన తర్వాత కూడా.. వెంకయ్యకు ఏపీ వ్యక్తి అన్న పక్షపాతం ఉందని చెప్పగలమా?

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కోసం పోరాడుతున్న తెలంగాణ ఎంపీలు.. ఆ విషయం గురించి ఎంత పోరాడినా ఎవరూ కాదనరు. కానీ.. ఆ ముసుగులో వెంకయ్య ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి.. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు చూస్తే.. టీఆర్ ఎస్ రాజకీయ మాయాజాలం ఇట్టే కనిపిస్తుంది. నిజంగా వెంకయ్యకు ఏపీ పట్ల పక్షపాతం ఉండి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం చేసిన ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని అంటారా? ఇప్పుడున్న పంచాయితీలు చాలవన్నట్లుగా.. మళ్లీ హైదరాబాద్ లో ఏపీ హైకోర్టుకు స్థలం చూపించటం.. దాన్లో హైకోర్టును ఏర్పాటు చేసుకోవటం లేని పోని సమస్య కాదా?

ఇప్పటికే తెలంగాణ అధికారపక్షానికి కోపం వచ్చిన ప్రతిసారీ.. మీ రాష్ట్రానికి మీరెళ్లిపోండంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేస్తున్న వారు.. రేపొద్దున మరోమారు కోపం వచ్చి.. మీ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసుకోలేకపోయారు.. మీ చేతకానితనం మాకు తెలుసులే అని ఎక్కెసం చేస్తే పరిస్థితి ఏమిటి? అంతేకాదు.. హైదరాబాద్ నుంచి పొమ్మని వ్యాఖ్యలు చేస్తే ఎక్కడ ముఖం చూపించుకోవాలి.

అంతేకాదు.. హైకోర్టుకు స్థలం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తే.. దాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఏపీనే డబ్బులు ఖర్చు చేయాలి. మరి.. ఇదేమైనా శాశ్విత పరిష్కారమా అంటే అదీ కాదు. ఇవాళ కాకున్నా రేపు.. కుదరదంటే ఎల్లుండి అయినా హైదరాబాద్ నుంచి ఖాళీ చేసి ఏపీకి వెళ్లాల్సిందేగా. మరి.. అలాంటప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన దానికి అయ్యే ఖర్చు.. ఏపీకి అదనపు భారమే. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ను పట్టించుకోకుండా.. ఏపీ హైకోర్టుకు స్థలం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పగానే.. బ్రహ్మాండంగా ఉందని తలూపేసిన కేంద్రమంత్రి వెంకయ్య నిజంగా ఏపీ పక్షపాతి అయి ఉంటే ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటారా?

తెలంగాణ సర్కారుకు ఇంత చేస్తున్నా.. సంతృప్తి చెందకుండా.. వెంకయ్యను ఏపీ వ్యక్తిగా ముద్ర వేసి.. లోక్ సభ నిండు సభలోనే వ్యాఖ్యలు చేసిన తీరు చూసినప్పుడు.. టీఆర్ ఎస్ నేతల తెంపరితనం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా.. బలంగా తమ వాదనను వినిపించలేని దద్దమ్మ ఏపీ ఎంపీల పుణ్యమా అని.. ఏపీకి మరోసారి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఏపీ హైకోర్టు కానీ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే.. దాన్ని మళ్లీ కదల్చటం అంత తేలికైన పని కాదు. దాని కారణంగా మరిన్న ఇక్కట్లు తప్పదు. దాని కంటే.. ఏపీ రాజధాని నిర్మిస్తున్న అమరావతికి దగ్గర్లోని విజయవాడలో కానీ.. గుంటూరులో కానీ హైకోర్టు ఏర్పాటు చేయటం ఉత్తమం.

ఈ ప్రతిపాదన చేసిన వెంటనే.. దూరం గురించిన చర్చ మొదలు పెడతారు. ఇలాంటప్పుడు హైదరాబాద్ లోని హైకోర్టు ఎక్కడుందన్నది చూస్తే.. విజయవాడ.. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయటం పెద్ద విషయం కాదన్నది అర్థం అవుతుంది.

హైదరాబాద్ లోని హైకోర్టు పాత బస్తీలో ఉంటుంది. దానికి హైటెక్ సిటీకి లేదంటే పటాన్ చెర్వు.. ఇటు హయత్ నగర్.. లాంటి ప్రదేశాలకు చాలానే దూరం ఉంటుంది. కాబట్టి.. దూరం అన్నది లెక్కలోకి తీసుకోకుండా.. వెనువెంటనే.. ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటం ఏపీ ప్రయోజనాలకు మంచిదన్న విషయాన్ని ఏపీ ఎంపీలు గుర్తించాలని ఏపీ విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే.. హైకోర్టు విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఏపీ ప్రజలు.. హైకోర్టు కోసం నిత్యం హైదరాబాద్ కు రావాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.