Begin typing your search above and press return to search.

రాజయ్య దెబ్బకు రాజుకున్న గొడవ

By:  Tupaki Desk   |   4 Nov 2015 6:18 AM GMT
రాజయ్య దెబ్బకు రాజుకున్న గొడవ
X
కాంగ్రెస్‌ మాజీ ఎంపీ - వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు తొలుత కాంగ్రెస్ టిక్కెట్ పొందిన సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చావో రేవో అన్న విధంగా వరంగల్‌ ఉపపోరు సాగనున్న నేపథ్యంలో పిల్లలతో సహా సారిక మృతిచెందడం కాంగ్రెస్‌ పార్టీకి చిక్కులు కలిగిస్తోంది. రాజయ్య కుమారుడు అనిల్‌ ను ప్రేమ వివాహం చేసుకున్న సారికతో అనంతర కాలంలో అనిల్ దూరంగా ఉంటున్నారు. రాజయ్య - ఆయన భార్య - అనిల్ లపై సారిక ఇంతకుముందే వేధింపుల కేసు పెట్టింది. తనను ఇంటికి రానివ్వడం లేదంటూ వారి ఇంటి ఎదుట ఆందోళన సైతం చేపట్టింది. అనిల్‌ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, పార్టీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసిన సారిక న్యాయం లభించక పోవడం... రాజయ్య కుటుంబం ఆమెను పట్టించుకోకపోవడంతో జీవనం కష్టమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

అయితే... ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రే జరగగా, ఉదయం వరకు విషయాన్ని బయటకు తెలియనీయక పోవడం సైతం పలు అనుమానాలు కలిగించింది. అయితే సిరిసిల్ల రాజయ్య ఇప్పటికే వరంగల్‌ లోక్‌ సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి, ప్రచారానికి సైతం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాల నేపథ్యంలో సారిక అనుమానాస్పద స్థితిలో ముగ్గురు పిల్లలతో సహా మృతి చెందడంతో ఆ కుటుంబం పట్ల, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తీరు పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆమె మరణించడానికి నాలుగు రోజుల ముందే రాజయ్యకు టికెట్‌ ఇవ్వవద్దంటూ కాంగ్రెస్‌ అధిష్టానానికి లేఖ రాయడం, మంగళవారం రాత్రి రాజయ్యకు, ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగడం, ఆ తరువాత ఆమె అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం వంటి ఘటనలు కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆమె గదిలో గ్యాస్‌ లీకై మరణించడంతో పాటు, రెండు సిలిండర్లు ఆమె బెడ్‌ రూమ్‌ లో ఉండటంతో హత్య కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఆమె అధిష్టానానికి లేఖ రాయడంతో పాటు, అవసరమైతే మళ్లీ ఆందోళన చేస్తానని హెచ్చరించిన నేపథ్యంలో సారిక మృతి చెందడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సారిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది.