Begin typing your search above and press return to search.

తమిళనాట కరోనా కలకలం.. 14 వేల చేరువకు పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   21 May 2020 4:30 PM GMT
తమిళనాట కరోనా కలకలం.. 14 వేల చేరువకు పాజిటివ్ కేసులు
X
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి.. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కొనసాగుతున్నా.. భారత్ లో ఏమాత్రం దాని వ్యాప్తి తగ్గిన దాఖలా కనిపించలేదు. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడులో కరోనా నిజంగానే విలయ తాండవం చేస్తోందని చెప్పాలి. ఆయా రాష్ట్రాల్లో రోజుకు డబుల్ డిజిట్ సంఖ్యలోనే కొత్త కేసులు నమోదు అవుతుండగా.. తమిళనాట మాత్రం నిత్యం ట్రిబుల్ డిజిట్ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడు రాజధాని చెన్నైలోనే మెజారిటీ కేసులు నమోదవుతున్న తీరు చూస్తుంటే.. చెన్నైని కరోనా తన గుప్పిట పట్టేసిందనే చెప్పాలి. గురువారం తమిళనాడు వ్యాప్తంగా 776 కొత్త కేసులు నమోదు కాగా... ఒక్క చెన్నైలోనే 567 కేసులు నమోదు కావడం విశేషం.

ఇక ఇప్పటిదాకా తమిళనాడు వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య విషయానికి వస్తే... 13,967 కేసులు నమోదు కాగా.. వీటిలో చెన్నై మహా నగరంలోనే 8,795 కేసులు నమోదయ్యాయి. అంటే తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 14 వేల దరిదాపుల్లోకి రాగా... చెన్నైలో 9 వేలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సమీపిస్తోంది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ లో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలోనే చెన్నైలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని చెప్పక తప్పదు. కోయంబేడు ఎఫెక్ట్ ఒక్క చెన్నైనే కాకుండా పొరుగు రాష్ట్రాలను కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి తిరిగివస్తున్న వారిలో ఇప్పటిదాకా తమిళనాట 61 మంది పాజిటివ్ గా తేలగా.. మహారాష్ట్ర నుంచి వస్తున్న వలస కూలీల ద్వారా కూడా రాష్ట్రంలో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గురువారం నమోదైన కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన వారే 76 మంది కరోనా బారిన పడ్డారు.

ఇదిలా ఉంటే... ఓ వైపు తమిళనాట కేసులు పెరిగిపోతున్నా... రికవరీ రేటు కూడా భారీగానే ఉంటోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ తెలిపారు. గురువారం కరోనా కారణంగా మరో ఏడుగురు మృత్యువాత పడగా... రాష్ట్రంలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 94కు చేరుకుంది. అదే సమయంలో గురువారం ఒక్కరోజే 400 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య తమిళనాడులో 6,282 మందికి చేరుకుంది. రోజుకు వందల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో తమిళనాడు ఎప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.