Begin typing your search above and press return to search.

దిశ చట్టాన్ని ఏపీలో ఎంత పక్కాగా అమలు చేస్తారంటే?

By:  Tupaki Desk   |   4 Jan 2020 4:54 AM GMT
దిశ చట్టాన్ని ఏపీలో ఎంత పక్కాగా అమలు చేస్తారంటే?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక అయిన దిశ 2019 చట్టాన్ని అమలు చేసే విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించింది ఏపీ సర్కారు. మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించే వారి విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉంటుందన్న విషయం తాజా చట్టాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దారుణమైన నేరాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించటమే కాదు.. స్వల్ప వ్యవధిలోనే విచారణ పూర్తి చేయటం ఈ చట్టం మరో ప్రత్యేకత.

చట్టంగా అందరి మనసుల్ని దోచుకున్నా.. దీని అమలు మాత్రం సాధ్యం కాదన్న మాట పలువురి నోట వినిపించింది. దీన్ని సవాలుగా తీసుకున్న ఏపీ సర్కారు.. ఈ చట్టం అమలు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. పకడ్బందీగా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా ఒక మహిళా ఐఏఎస్.. మరో మహిళా ఐపీఎస్ అధికారిణిలను ఏర్పాటు చేశారు. తాజాగా మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు.. ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్.. బోధనాస్పత్రుల్లో వైద్య కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. మహిళలు.. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డ నిందితులకు 21 రోజుల్లో కఠిన శిక్షలు పడేందుకు వీలుగా మౌలిక వసతుల్ని సిద్ధం చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ల ఏర్పాటు.. సిబ్బంది నియమకాల్ని పూర్తి చేయనున్నారు. అంతేకాదు.. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈ నెల 7న దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తారు. కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. జనవరి నెలాఖరు నాటికి దిశ చట్టాన్ని అమలు చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. అంతకు ముందే.. చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.