Begin typing your search above and press return to search.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ : పోలీసుల మెడకు ఉచ్చు...సిర్పూర్కర్ కమిషన్ ఏంచెప్పబోతుంది?

By:  Tupaki Desk   |   17 Nov 2021 11:30 PM GMT
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ : పోలీసుల మెడకు ఉచ్చు...సిర్పూర్కర్ కమిషన్ ఏంచెప్పబోతుంది?
X
దిశ హత్యాచార నిందితుల ఎన్‌ కౌంటర్‌ విచారణలో అప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ పేరు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. నిందితుల ఎన్‌ కౌంటర్‌ కు సంబంధించి ముందస్తు గా తనకేమీ తెలియని సజ్జనార్ విచారణ కమిటీ ముందు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే దిశ హత్యాచార నిందితుల ఎన్‌ కౌంటర్‌ బూటకమని, తప్పించుకునేందుకే పోలీసులు కట్టుకథ అల్లారని విచారణ కమిషన్‌ ముందు, మృతుల కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది పీవీ కృష్ణమాచారి వాదించారు. పథకం ప్రకారమే ఎన్‌కౌంటర్ జరిగిందని, దీనికి అప్పటి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌దే మాస్టర్‌ ప్లాన్‌ అని కమిషన్‌ కు చెప్పారు.

నలుగురు నిందితులను ముగ్గురు పోలీసులు కాల్చి చంపగా, వారికి మిగిలిన వారు చాలా సహకరించారని, వీరందరి పై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కు ఆదేశించాలని కృష్ణమాచారి కమిటీని కోరారు. నిందితులను 10 రోజులపాటు పోలీస్‌ కస్టడీకి ఇవ్వడం చట్టవిరుద్ధమని, వాళ్లను అర్ధరాత్రి చర్లపల్లి జైలు నుంచి తీసుకెళ్లడం అనుమానించాల్సిన విషయమని అన్నారు.

వాళ్లని ఎన్‌ కౌంటర్ చేయాలని షాద్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌ లోనే పథకం రచించారని, ఆ తర్వాత సంఘటనా స్థలానికి తీసుకెళ్లి తప్పించుకోవడానికి ప్రయత్నించారన్న నెపం లో కాల్చి చంపేశారని తెలిపారు. అరెస్ట్‌, రిమాండ్‌, కస్టడీకి జైలు నుంచి తరలింపు సమయాల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నమేమీ చేయలేదని కృష్ణమాచారి కమిషన్‌కు వివరించారు.

ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని నిందితుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సిర్పూర్కర్ కమీషన్ ను ఏర్పాటుచేసి ఎన్ కౌంటర్ పై నిజానిజాలు తేల్చాల్సిందిగా ఆదేశించింది. 15 మంది పోలీసులతో సహా 54 మంది సాక్షులను విచారించగా ఎన్ కౌంటర్ కు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం విచారణలు ముగిశాయి. ఈ ఎన్ కౌంటర్ కి నాడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను,15 మంది పోలీసులను విచారించిన సిర్పూర్కర్ కమిషన్ తమ ప్రశ్నలతో పోలీసులకి ముచ్చెమటలు పట్టించిందని వార్తలు వచ్చాయి.

పోలీసులు ఒకరికొకరు భిన్నమైన సమాధానాలు చెప్పడంతో వాటన్నింటినీ నమోదు చేసిన సిర్పూర్కర్ కమిషన్ దిశ ఎన్ కౌంటర్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన పోలీసుల వ్యక్తమవుతున్న సమయంలో మృతుల కుటుంబ సభ్యుల తరుపున న్యాయవాదులు బూటకపు ఎన్కౌంటర్ అని నిరూపించడం కోసం తమ వద్ద ఉన్న ఆధారాలను కమీషన్ ముందుంచారు.

నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని, వారిని జువైనల్ కోర్టుకు పంపకుండా, వారి వయసును దాచిపెట్టి మరి మామూలు జైలుకు పంపారని కమిషన్ ముందు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా తప్పుడు రికార్డులు సమర్పించారని వారు ఆరోపించారు. న్యాయవాది వసుధా నాగరాజు వాదనలు వినిపిస్తూ నిందితులను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాల్సి ఉండగా, అలా కాకుండా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు అని పేర్కొన్నారు.

అక్కడ 15 రోజుల పాటు నిందితులకు రిమాండ్ విధించడం కూడా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం పోలీసులు ఈ విధంగా తప్పుల మీద తప్పులు చేశారని వారి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో ఈ కేసులో పోలీసులు మెడకు ఉచ్చు బిగుస్తోంది అన్న ఆందోళన పోలీసు శాఖలో పెద్ద చర్చగా మారిందట. కమిషన్ త్వరలోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించబోతున్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ : పోలీసుల మెడకు ఉచ్చు...సిర్పూర్కర్ కమిషన్ ఏంచెప్పబోతుంది?