Begin typing your search above and press return to search.

దిశ ఎన్ కౌంటర్ తో కేంద్రానికి వేడి పుట్టించిన కేసీఆర్?

By:  Tupaki Desk   |   7 Dec 2019 5:33 AM GMT
దిశ ఎన్ కౌంటర్ తో కేంద్రానికి వేడి పుట్టించిన కేసీఆర్?
X
హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై జరిగిన హత్యాచార ఉదంతం దేశాన్ని ఎంతలా కదిలించి వేసిందో చెప్పాల్సిన అవసరమే లేదు. దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దిశ హత్య జరిగిన తొమ్మిదో రోజున.. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు హతం కావటం మరో సంచలనంగా మారింది. దారుణమైన నేరానికి పాల్పడిన వారికి సరైన శిక్ష విధించారని ఎన్ కౌంటర్ పై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.

దిశ నిందితులకు సరైన శిక్ష పడింది సరే..? అప్పుడెప్పుడో నిర్భయ ఉదంతంలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినా.. ఇప్పటివరకూ ఎందుకు రియాక్ట్ కాలేదు? అని ప్రశ్న అంతకంతకూ పెరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో నిర్భయ ఉదంతం మరోసారి తెర మీదకు రావటమే కాదు.. ఆ రాక్షసులకు చట్టబద్ధంగా అమలు చేయటానికి కూడా మరీ ఇంత ఆలస్యమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే సమయంలో అత్యాచార దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష అన్నది లేదని రాష్ట్రపతి కోవింద్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ఖాయమంటున్నారు. దోషులను చట్టప్రకారం శిక్షించేందుకు సాగుతున్న ఆలస్యంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వారిని శాంతింపజేసేందుకు నిర్భయ దోషులకు ఏ క్షణంలో అయినా ఉరి అమలు చేయొచ్చని తెలుస్తోంది. నిర్భయ ఉదంతంలోని దోషుల్లో ఒకరు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా నిన్నటి వరకూఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉరిశిక్షను అమలు చేసేందుకుచర్యల్ని వేగవంతం చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏ క్షణంలో అయినా ఉరిని అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు నిర్భయ తల్లి సైతం స్పందిస్తూ.. దిశ నిందితులకు శిక్ష పడితే.. దుర్మార్గం జరిగిన ఏళ్లకు ఏళ్లు గడిచినా.. నిర్భయ దోషులకు మాత్రం శిక్షలు అమలు కావట్లేదన్న ధర్మాగ్రహాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఆమె గొంతుకు లక్షలాది గళాలు తోడవుతున్న వేళ.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు దగ్గర్లోనే ఉందంటున్నారు.