Begin typing your search above and press return to search.

రేపు దిశ నిందితులకు రీపోస్టుమార్టం చేయనుంది ఎవరంటే?

By:  Tupaki Desk   |   22 Dec 2019 6:39 AM GMT
రేపు దిశ నిందితులకు రీపోస్టుమార్టం చేయనుంది ఎవరంటే?
X
దిశను దారుణంగా హత్యాచారం చేసిన నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించటం తెలిసిందే. ఎన్ కౌంటర్ మీద అనుమానాలు వ్యక్తం కావటం.. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో నలుగురి మృతదేహాలను భద్రపర్చటం తెలిసిందే. అయితే.. కాలం గడుస్తున్న కొద్దీ మృతదేహాలు చెడిపోతున్న వేళ.. తక్షణం రీపోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దిశ నిందితుల మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్ట్ మార్టం చేయించాలని హైకోర్టు పేర్కొంది. సోమవారం సాయత్రం 5 గంటల లోపు రీపోస్టమార్టంను నిర్వహించి..మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పజెప్పాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదేశాల్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్.. జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం దిశ నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచారు. మృతదేహాలకు సంబంధించి తాము తీసుకున్న జాగ్రత్తలు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇదే తీరులో ఉంచితే రానున్న రోజుల్లో ఏం జరగనుంది? లాంటి అంశాల్ని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ హైకోర్టుకు హాజరై వెల్లడించారు.

ప్రస్తుతం దిశ మృతదేహాలను మైనస్ 2 నుంచి మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ లో భద్రపరిచినట్లు చెప్పారు. మైనస్ ఐదు నుంచి మైనస్ పది వరకూ డెడ్ బాడీస్ ను భద్రపర్చటానికి దేశంలో ఎక్కడా ఎలాంటి సదుపాయం లేదన్నారు. ఇప్పటికే మృతదేహాలుఅంతర్గతంగా 50 శాతం పాడైనట్లుగా కోర్టుకు చెప్పారు.

దీనిపై స్పందించిన హైకోర్టు దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం రీపోస్టమార్టం నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులకు విమానఖర్చులు.. వసతి.. ఇతర ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరించాలని కోర్టు పేర్కొంది. నాలుగు మృతదేహాలకు క్షుణ్ణంగా రీ పోస్టమార్టం చేసి.. సమగ్ర నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు అందజేయాలని ఆదేశించారు. రీ పోస్టమార్టం అనంతరం సాయంత్రం ఐదు గంటల లోపు మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని పేర్కొన్నారు.

దిశ హత్యాచారం.. ఘటన.. అనంతరం నిందితుల ఎన్ కౌంటర్ మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి సుప్రీం తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ కేసులో మృతులకు సంబందించి ఎలాంటి ప్రాసిక్యూషన్ చేయటానికి వీల్లేదని తేల్చారు. దిశ హత్యాచారం మొదలుకొని నిందితుల ఎన్ కౌంటర్ జరిగినంత వరకూ పోలీసుల కదలికలు.. ఎన్ కౌంటర్ లో వినియోగించిన ఆయుధాలను వెంటనే సీజ్ చేయాలన్నారు.ఓవైపు హైకోర్టు.. మరోవైపు సుప్రీంకోర్టు వెలువరించిన కీలక ఆదేశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. రీపోస్టుమార్టం రిపోర్టు ఏ తీరులో రానుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.