Begin typing your search above and press return to search.

బెయిల్ రద్దు పిటీషన్: కోర్టులో జగన్, విజయసాయికి గొప్ప ఊరట

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:04 AM GMT
బెయిల్ రద్దు పిటీషన్: కోర్టులో జగన్, విజయసాయికి గొప్ప ఊరట
X
ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలని కోరారు. బెయిల్ రద్దు చేసి ఆయనపై కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం రఘురామ పిటీషన్లను కొట్టివేసింది.

జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ కోర్టులో గత మూడు నెలలుగా సుధీర్ఘ విచారణ జరిగింది.

బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా సీబీఐ కోర్టు విధించిన ఏ షరతులను తాము ఉల్లంఘించలేదని జగన్, విజయసాయిరెడ్డిలు నిరూపిస్తూ వాదించారు. అందువల్ల తమ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు వాదనను తోసిపుచ్చారు. రఘురామ కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పిటీషన్ దాఖలు చేశారని జగన్ తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటీషన్ ను కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్టు ఎంపీ రఘురామ చెప్పి ఈ కేసులో మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు.