Begin typing your search above and press return to search.

ఇక అప్పుల గోల‌!...ఎవ‌రు ఎవ‌రికి అప్పు?

By:  Tupaki Desk   |   9 March 2019 1:30 AM GMT
ఇక అప్పుల గోల‌!...ఎవ‌రు ఎవ‌రికి అప్పు?
X
తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డ్డ తెలంగాణ‌ - 13 జిల్లాల‌తో కొత్త ప‌య‌నం ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య నిత్యం వివాదాలే కొన‌సాగుతున్నాయి. అప్ప‌టిదాకా ఉమ్మ‌డి రాష్ట్రంలో కొన‌సాగిన ఆయా ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ రెండుగా విడిపోగా... ఎవ‌రి ఫైళ్లు ఏవి? ఏ ఆస్తులు ఎవ‌రివి? అన్న విష‌యాన్ని తేల్చుకునే క్ర‌మంలో పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం... త‌న ప‌రిధిని కుదించేసుకోగా... రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న చాలా వివాదాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వెలుగు చూసిన ఓటుకు నోటు - ఇప్పుడు డేటా చోరీ కేసులు ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కూడా దారి తీశాయి. ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చిన డేటా చోరీ కేసు ఎప్ప‌టికి తేలుతుందో... ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎంత అగాథాన్ని సృష్టిస్తుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి కీల‌క త‌రుణంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం వ‌చ్చి చేరింది. అదే విద్యుత్ బ‌కాయిల‌కు సంబంధించిన వివాదం.

తెలుగు నేల రెండుగా విడిపోయిన త‌ర్వాత... విద్యుదుత్ప‌త్తి కాస్తంత ఎక్కువ‌గా ఉన్న ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్‌ ను కొనుగోలు చేసేది. ఇందుకు ప్ర‌తిగా ఏపీలోని విద్యుదుత్ప‌త్తి సంస్థ‌ల‌కు సింగ‌రేణి నుంచి బొగ్గును స‌ర‌ఫ‌రా చేసేది. అయితే విద్యుత్ కొనుగోలు నిధులు - సింగ‌రేణి బొగ్గు కొనుగోలు నిధుల‌కు సంబంధించి రెండు రాష్ట్రాలు త‌మ త‌మ వాద‌న‌ల‌ను వినిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ త‌న‌కు అప్పు ఉంద‌ని ఏపీ - ఏపీనే త‌న‌కు అప్పు ఉంద‌ని తెలంగాణ వాదించుకుంటున్నాయి. ఈ విష‌యం ఎటూ తేల‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఏపీ నేరుగా లా ట్రైబ్యూన‌ల్‌ ను ఆశ్ర‌యించింది. దీంతో నిన్న‌టిదాకా కాస్తంత సైలెంట్‌ గానే ఉన్న తెలంగాణ‌... ఏపీ చ‌ర్య‌తో ఒక్క‌సారిగా ఫైర్ అయిపోయింది. అయినా ఏపీనే త‌న‌కు అప్పు ఉంద‌ని, అలాంటిది త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే న్యాయ‌స్థానాల‌ను ఎలా ఆశ్ర‌యిస్తార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేసింది.

ఈ వివాదంలో తెలంగాణ వాద‌న‌ను వినిపించేందుకు నేడు ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ జెన్ కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఏపీలో విద్యుత్ సంస్థలకూ, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం కొరవడినట్టుందని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌భాక‌ర్ రావు... ఏపీనే తెలంగాణ‌కు 2,046 కోట్ల మేర అప్పు ప‌డింద‌ని చెప్పారు. తెలంగాణే తమకు రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఏపీ విద్యుత్ సంస్థలంటున్నాయని, కానీ అన్ని లెక్కలు చూశాక తెలంగాణ ప్రభుత్వానికే ఏపీ రూ.2,046 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోకుండా లా ట్రైబ్యునల్‌ను సంప్రదించడమేంటని ప్రభాకర్‌ రావు ఏపీ వైఖ‌రిని నిలదీశారు. ఈ సంద‌ర్భంగా ఏపీ వాద‌న‌ను ప్ర‌భాక‌ర్ రావు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఏపీ ఇచ్చేదేమో డబ్బు.. తెలంగాణ‌ ఇచ్చేది మాత్రం డబ్బు కాదా అంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే.. కొనుగోలు తప్పనిసరి అని, తాము ఏం చేసినా పారదర్శకంగానే చేస్తామని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ఎప్ప‌టికి ప‌రిష్కారం అవుతుందో చూడాలి.