Begin typing your search above and press return to search.

జగన్ లైట్ తీసుకున్నారు.. ఆమె అదే బాటలో నడిచిన షర్మిల

By:  Tupaki Desk   |   22 Dec 2022 3:49 AM GMT
జగన్ లైట్ తీసుకున్నారు.. ఆమె అదే బాటలో నడిచిన షర్మిల
X
కుటుంబం అన్న తర్వాత ఏవో ఒక ఇష్యూ కామన్. అది సామాన్యుడికైనా.. ప్రముఖుడికైనా తప్పదు. అందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మినహాయింపు కాదన్న విషయం తాజా పరిణామాల్నిచూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు అన్న కోసం చెల్లెలు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. అన్న జైల్లో ఉన్నప్పుడు ఆయన తరఫున పార్టీ బాధ్యతల్ని తీసుకొని.. సొంతంగా పాదయాత్ర చేస్తూ.. అన్నకు తగ్గ చెల్లెలు అనుకునేలా చేశారు.

అంతేకాదు.. ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధమే అనుబంధం అనుకునేలా వారిద్దరి మధ్య అన్యోన్యత కనిపించేది. ఎప్పుడైతే జగన్ జైలు నుంచి బయటకు వచ్చారో.. అప్పటినుంచి షర్మిల బయట కనిపించటం మానేశారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటుందన్న ప్రచారం జరిగేది. సన్నిహితులు మాత్రం.. షర్మిల విషయంలో జగన్ కు కొన్ని అభిప్రాయాలు ఉండేవని.. పార్టీ మొత్తాన్ని తానే హ్యాండిల్ చేసేలా చూసుకోవాలన్న ఆలోచన ఉండేదని చెప్పేవారు. పార్టీలో రెండు పవర్ పాయింట్స్ ఉండటం మంచిది కాదన్న అన్న మాటకు చెల్లెలు సైతం సరే అన్నట్లుగా చెబుతారు.

ఆ తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు.. వాటి కారణంగా చెల్లెలు షర్మిల మనసు తీవ్రంగా గాయపడిందని చెబుతారు. దేనినైనా ఒక స్థాయి వరకు సరేనని భరించే ఓర్పు షర్మిల సొంతమని.. కానీ తేడా వస్తే దేనికైనా సిద్ధమన్నట్లుగా ఆమె వైఖరి ఉంటుందన్న విషయాన్ని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఏదైనా పట్టుపట్టిన తర్వాత దాని కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడతారని చెబుతారు. అందుకు తగ్గట్లే.. అన్న జగన్ తో విభేదాలు మొదలైన తర్వాత.. తన రాజకీయ ఉనికిని చాటుకోవటానికి పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిపిన తర్వాతే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకోవాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతారు.

పార్టీ పెట్టటానికి జగన్ కు ససేమిరా అనటం.. ఈ సందర్భంగా ఇంట్లో జరిగిన ఘటనల గురించి కొందరు చెబుతున్నా.. అవన్నీ మూడో మాటగానే చెప్పాలే కానీ.. ఇప్పటివరకు జగన్ కానీ షర్మిల కానీ కామెంట్ చేసింది లేదు. కాకుంటే.. వీరిద్దరి మధ్య పెరిగిన దూరానికి తగ్గట్లు.. తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.. వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఒకరికొకరు సంబంధం లేకుండా హాజరు కావటంతో.. వీరి విభేధాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని అర్థం చేసేలా చేసిందంటారు.

జగన్ పుట్టిన రోజు డిసెంబరు 21 అయితే.. షర్మిల పుట్టిన రోజు అందుకునాలుగు రోజుల ముందు. అంటే.. డిసెంబరు 17న. మొదట వచ్చిన షర్మిల పుట్టిన రోజు సందర్భంగా అన్న జగన్ ట్వీట్ రూపంలో అయినా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పక పోవటం తెలిసిందే. అయితే.. జగన్ బర్త్ డే హైలెట్ అయినట్లుగా షర్మిల పుట్టిన రోజుకాలేదు. దీంతో.. జగన్ శుభాకాంక్షలు చెప్పారా? లేరా? అన్న దానిపై ఎవరి కన్నుపడలేదు. దీనికి తోడు.. పుట్టినరోజు నాడు.. ఆమె తన కొడుకును చూసేందుకు అమెరికాకు వెళ్లటంతో పార్టీ కార్యక్రమం కూడా జరగలేదు.

తాజాగా జగన్ పుట్టిన రోజు సందర్భంగా మాత్రం షర్మిల నుంచి బర్త్ డే విషెస్ రాకపోవటం మాత్రం చర్చకు వచ్చింది. అందరూ షర్మిలను ఒక మాట అనే వారే కానీ.. దానికి నాలుగు రోజులు ముందు ఆమె పుట్టిన రోజు సందర్భంగా జగన్ నుంచి ఎలాంటి శుభాకాంక్షలు లేకపోవటాన్ని ప్రస్తావించటం లేదు. మొత్తంగా చూస్తే.. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పూడ్చలేనంత ఎక్కువగా పెరిగిందన్న విషయానికి నిదర్శనంగా నిలిచిందన్న మాట వినిపిస్తోంది. ఒకప్పుడు అన్నాచెల్లెళ్లు అంటే నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వీరిద్దరూ కాల మహిమతో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారన్నది తెలిసిందే. వీరిద్దరి మధ్య పెరిగిన దూరాన్ని వైఎస్ ఆత్మ చూస్తే మాత్రం బాధ పడుతుందన్న మాట ఆయన సన్నిహితులు వాపోవటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.