Begin typing your search above and press return to search.

జాతీయ జెండా పట్టుకొని నిరసన చేస్తున్న వ్యక్తిపై జిల్లా అదనపు మెజిస్ట్రేట్ దాడి

By:  Tupaki Desk   |   23 Aug 2022 4:57 AM GMT
జాతీయ జెండా పట్టుకొని నిరసన చేస్తున్న వ్యక్తిపై జిల్లా అదనపు మెజిస్ట్రేట్ దాడి
X
చేతిలో అధికారం ఉంటే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించొచ్చా? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులే అన్న విషయాన్ని మర్చిపోయి.. దారుణంగా వ్యవహరించిన వైనం ఒకటి బయటకు వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహాం వ్యక్తమవుతోంది.

బిహార్ ఉప ముఖ్యమంత్రి సైతం జరిగిన పరిణామంపై సీరియస్ అయ్యారు. ఒకనిరసన కార్యక్రమంలో జాతీయ జెండాను పట్టుకొని నిరసన చేస్తున్న వ్యక్తిని.. కనికరం అన్నది లేకుండా విచక్షణ మరిచి.. లాఠీలతో ఇష్టారాజ్యంగా కొట్టిన జిల్లా అదనపు మెజిస్ట్రేట్ తీరు విమర్శలకు తావిస్తోంది. జాతీయ జెండాను పట్టుకున్నప్పటికీ లెక్క చేయకుండా కొట్టిన వైనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

టీచర్ల నియామక ప్రక్రియ లేట్ అవుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బిహార్ కు చెందిన ఉద్యోగార్థులు సోమవారం నిరసన చేపట్టారు. రిక్రూట్ మెంట్ ను త్వరగా పూర్తి చేసి అపాయింట్ మెంట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. జాతీయ జెండాలను.. ప్లకార్డుల్ని పట్టుకొని బిహార్ రాజధాని పాట్నాలో నిరసన చేపట్టారు. తమ సమస్యల గురించి వెల్లడిస్తూ నిరసన తెలుపుతున్నారు.

ఇలాంటి వేళ.. తమ వద్దకు వచ్చిన మీడియాతో ఒక నిరసనకారుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన జిల్లా అదనపు మెజిస్ట్రేట్ కేకే సింగ్ తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. జాతీయ జెండాను అడ్డుగా పెట్టుకొని ఉన్న నిరసనకారుడ్ని ఏ మాత్రం లెక్క చేయకుండా..

లాఠీతో అతడ్ని దారుణంగా కొట్టేశారు. ఇదంతా జరుగుతున్నా.. చుట్టూ ఉన్న పోలీసులు అడ్డుకోలేదు సరికదా.. సదరు నిరసనకారుడు నాటకాలు ఆడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. జిల్లా అదనపు మెజిస్ట్రేట్ మోదాలో ఉన్న అధికారి లాఠీతో విచక్షణ రహితంగా కొట్టేస్తున్న వైనాన్ని తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో.. ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. కేకే సింగ్ తీరుపై జిల్లా మెజిస్ట్రేట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఈ ఉదంతంపై విచారణకు ఒక కమిటీని వేశారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీరియస్ కావటమే కాదు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటానని.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. లాఠీ దెబ్బలకు బాధితుడికి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా చితకబాదిన వైనంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.