Begin typing your search above and press return to search.

అది మరకత మణి విగ్రహంలో ట్విస్టు.. అది మరకతం కాదంటున్న ఎస్పీ

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:30 PM GMT
అది మరకత మణి విగ్రహంలో ట్విస్టు.. అది మరకతం కాదంటున్న ఎస్పీ
X
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లభ్యమైన 'పంచముఖ మరకత గణపతి విగ్రహం' వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు అది మరకత మణితో రూపొందించిన విగ్రహం అని, కోట్ల రూపాయల విలువ చేస్తుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మరకత గణపతి విషయంలో జిల్లా ఎస్పీ మలికాగార్గ్ షాక్ ఇచ్చారు. పంచముఖ గణపతి విగ్రహం మరకత మణితో తయారు చేసింది కాదని తెలిపారు. అంతేకాకుండా దాని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వెల్లడించారు. పైగా అది పురాతన విగ్రహం కాదన్నారు.

పంచముఖ గణపతి విగ్రహం మరకత మణితో తయారు చేయలేదని.. అది పురాతనమైనది కాదని ఎస్పీ మలికాగార్గ్ చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని అమ్ముతుండగా అప్రమత్తంగా వ్యవహరించి డెకాయ్ ఆపరేషన్ లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ విగ్రహం గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ కు అప్పగించామని వివరించారు. వారి నుంచి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా, స్వచ్చమైన ఆకుపచ్చ రంగుతో ఉన్న ఈ పంచముఖ గణపతి విగ్రహం విలువ అక్షరాలా రూ.25 కోట్లకు పైమాటేనని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండడుగులు మాత్రమే ఉన్న ఆ విగ్రహం చాలా బరువు ఉంటుంది. దేశంలో ఇలాంటివి ఈ ఏడాది రెండు మాత్రమే లభించాయి. ఒకటి తమిళనాడులో లభించగా మరొకటి ఆంధ్రప్రదేశ్ లో యర్రగొండపాలెంలో దొరికింది.

సాధారణంగా యర్రగొండపాలెం నల్లమల అడవులను ఆనుకుని ఉంటుంది. నల్లమల అడవుల్లోనే శ్రీశైలం, మహానంది, ఉమామహేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం కావడంతో పురాతన ఆలయాలు ఈ ప్రాంతంలో ఎక్కువ. ఈ నేపథ్యలోనే కేవలం రెండు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పు కల్గిన పంచముఖ వినాయకుడి విగ్రహం లభించింది. ఈ విగ్రహం బరువు ఏకంగా 90 కిలోలు ఉండటం గమనార్హం.

ఈ విగ్రహం సుమారుగా 500 ఏళ్ల కాలం నాటిదని నిపుణులు అంచనా వేస్తున్నా…అంతకు మించి ఉంటుందని స్థానికులు అంటున్నారు. పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ఓ గ్యాంగుకు ఈ పంచముఖ గణపతి విగ్రహం లభ్యమైందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇటువంటి ప్రాచీన కళాకాండాలను అమ్మడం, కొనుగోలు చేయడంలో యర్రగొండపాలెం పంచాయితీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మంచి ఆసక్తి కనబరుస్తుంటాడని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసే ఇంద్రసేనా రెడ్డికి రాజశేఖర్ రెడ్డి వరుసకు బావ అవుతాడు. మరకత విగ్రహం విషయాన్ని అతనికి చెప్పి అమ్మాకానికి పెట్టాలని కోరాడు.

ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో జూన్ 10న వారే కొంటామంటూ నమ్మబలికిన పోలీసులు అక్కడికి మప్టీలో వెళ్లారు. యర్రగొండపాలెం, వినుకొండ రోడ్డులోని వెంకటేశ్వరరెడ్డికి చెందిన షెడ్డులో విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వీరిని అరెస్టు చేయడంతో ఓ మంత్రి జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే 41 నోటీసులు జారీ చేసి రాత్రికి రాత్రే నిందితులను స్టేషన్ బెయిల్ పై పంపించేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ విగ్రహంపై స్పష్టత ఇవ్వడంతో అది మరకతం కాదని.. దాని విలువ కోట్ల రూపాయల్లో అనేది కూడా ఒట్టిమాటేనని తేటతెల్లమైంది.