Begin typing your search above and press return to search.

మ‌రో కొత్త డిమాండ్‌.. ఏఎన్నార్ పేరుతో జిల్లా!

By:  Tupaki Desk   |   29 Jan 2022 8:33 AM GMT
మ‌రో కొత్త డిమాండ్‌.. ఏఎన్నార్ పేరుతో జిల్లా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో అసంతృప్తి సెగలు ర‌గులుతూనే ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యంపై ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. 13గా ఉన్న జిల్లాల‌ను 26గా చేస్తూ కేబినేట్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వివాదాలు నెల‌కొన్నాయి. ముఖ్యంగా జిల్లాల పేర్ల‌పై కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వంగ‌వీటి రంగా, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాల‌నే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగ‌త దిగ్గ‌జ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరు పెట్టాల‌ని ఆయ‌న అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది.

జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఏర్ప‌డుతున్న కొత్త జిల్లా మ‌చిలీప‌ట్నానికి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరు పెట్టాల‌ని అక్కినేని అభిమానుల సంఘం నేత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. మ‌చిలీప‌ట్నానికి ఏఎన్నార్ జిల్లాగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గుడివాడ రామాపురంలో పుట్టార‌ని తెలుగు చిత్ర రంగంలో ఓ దిగ్గ‌జంగా ఎదిగార‌ని వాళ్లు పేర్కొన్నారు. మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీసుకు వ‌చ్చే విష‌యంలో అక్కినేని ఎంతో కృషి చేశార‌ని ఆయ‌న అభిమానులు తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆ దిగ్గ‌జ న‌టుడి పేరును జిల్లాకు పెట్టి ఆయ‌న‌కు గుర్తింపు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇప్ప‌టికే కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోతున్న విజ‌య‌వాడ జిల్లాకు ఏపీ ప్ర‌భుత్వం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఈ నిర్ణ‌యాన్ని టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు పురంధ‌రేశ్వ‌రి త‌దిత‌రులు స్వాగ‌తించారు. అయితే విజ‌య‌వాడ‌కు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంపై భిన్నాభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న జ‌న్మించిన నిమ్మ‌కూరు కొత్త‌గా ఏర్ప‌డే కృష్ణాలో ఉంటుంది. అలాంటిది ఆ జిల్లాకే ఆయ‌న పేరు పెట్టాల‌నే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. మ‌రోవైపు విజ‌య‌వాడ‌కు దివంగ‌త నేత వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.