Begin typing your search above and press return to search.

టీడీపీలో నారా-నంద‌మూరి లుక‌లుక‌లు!

By:  Tupaki Desk   |   2 Oct 2018 6:49 AM GMT
టీడీపీలో నారా-నంద‌మూరి లుక‌లుక‌లు!
X
వచ్చే ఎన్నికల సీట్ల పంచాయితీ నారా కుటుంబంలో లుకలుకలకు దారి తీస్తోందా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడు మాత్రమే కాకుండా.. బాలయ్య కూడా పార్టీ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకొంటూ ఉండటంతో ఈ వ్యవహారం రచ్చ అవుతోందా? న‌ంద‌మూరి కుటుంబానికి టీడీపీ పై ఎపుడూ హ‌క్కు ఉంటుంది. అందువ‌ల్లే ఆ కుటుంబం పార్టీపై ప‌ట్టు సాధించ‌కూడ‌దు అని బాబు అనుకుంటూ ఉంటారు. అందుకే పొలిటిక‌ల్ యాక్టివ్‌ గా ఉన్న బాల‌య్య మ‌రింత బ‌ల‌ప‌డే లోపు బాలయ్యకు చెక్ పెట్టాలని బాబు అనుకొంటున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో తన ఉనికిని కాపాడుకోవడానికి బాలయ్య చేస్తున్న ప్రయత్నంతో పాటు ఇంకో వైపు కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ చంద్రబాబు - నారా లోకేష్ ల మధ్య కూడా పెరిగిన అంతరం వ‌ల్ల తెలుగుదేశంలో అంత‌ర్గ‌తంగా ర‌చ్చ న‌డుస్తోంది. ఈ నేపథ్యంలో నారా కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయనే ప్రచారాన్ని తీవ్రతరం చేస్తూ ఉంది.

ముందుగా బాలయ్యను వచ్చే ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయనీయకూడదు అనేది చంద్రబాబు ఆలోచన. అసలుకు నందమూరి కుటుంబం యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండటం బాబుకు ఏనాడూ ఇష్టం లేదు. బాలయ్య గత ఎన్నికల్లో మిగతా రాష్ట్రంలో ప్రచారాన్ని పక్కన పెట్టేసి హిందూపురంలో తిష్ట‌వేసి త‌న సీటు ద‌క్కించుకున్నాడు. అందుకోసం పెద్ద ఎత్తున ఖ‌ర్చు కూడా పెట్టిన‌ట్లు స్థానికులు చెబుతారు. బాల‌య్య మంచి మెజారిటీతో గెలిచాక ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. బాలయ్య కూడా మంత్రి పదవిని ఆశించినా బాబు దాన్ని పట్టించుకోలేదన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందుకే బాలయ్య అసెంబ్లీకి పెద్దగా హాజ‌రు కావ‌డం లేద‌ట‌.

ఇక వచ్చే ఎన్నికల్లో తన తనయుడిని ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలపాల్సి ఉంది చంద్రబాబు నాయుడు. లోకేష్ మంత్రెట్లా అవుతాడు అన్న సెటైర్లు త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోకి లోకేష్ దిగ‌నున్నారు. అయితే దీనికి ఒక సేఫ్ సీటు కావాలి. ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు చంద్ర‌బాబు. తనయుడి కోసం తన సీటును ఖాళీ చేసేందుకు చంద్రబాబు నాయుడు సమ్మతంతో లేడు. అందుకే.. బాలయ్యను త్యాగం చేయమని అంటున్నాడట. అల్లుడు కాబట్టి.. బాలయ్య చేయాలనేది బాబు ఆబ్లిగేష‌ను. అయితే హిందూపురాన్ని వదులుకుంటే బాలయ్యకు మరో సీటు విషయంలో చంద్రబాబు భరోసా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక త్యాగం చేసి తప్పుకోవడమే బాలయ్య పని అన్నట్టుగా బాబు వ్యవహరిస్తున్నాడట. అయితే బాలయ్య మాత్రం దీనికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. తను తప్పుకోవడానికి ససేమేరా అంటున్నాడట ఆయన. ఇక బాలయ్య నుంచి మరో డిమాండ్ కూడా వినిపిస్తోందట. తన చిన్నల్లుడికి ఎంపీ టికెట్ ఇస్తే త‌న సీటు త్యాగం చేయ‌డానికి బాలయ్య ఓకే అంటున్నాడ‌ట‌. విశాఖ ఎంపీగా బాలయ్య అల్లుడు భరత్ పోటీ చేయాలని అనుకుంటున్నాడని సమాచారం. ఒకవైపు పార్టీలో బాలయ్య కే చెక్ పెట్టాలని బాబు అనుకుంటుంటే.. ఇప్పుడు మరో అల్లుడును రంగంలోకి దించుతానంటే బాబు సమ్మతిస్తాడా? పార్టీలో బాలయ్య ప్రాబల్యాన్ని పెంచడానికి బాబు ఇష్టపడతాడా? అనేదానికి సమాధానం సులభంగానే దొరుకుతుంది.

ఇక మ‌రోవైపు లోకేష్ ఇప్పటికీ మెరుగు పడకపోవడం - ప్ర‌సంగాల్లో ఏదో రకంగా జనాలకు దొరికిపోతూ ఉండటం - ‘పప్పు’గా ప్రత్యర్థుల చేతిలో విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం బాబుకు ప్రశాంతత లేకుండా చేస్తోంది. త‌న‌ను తాను స‌రిదిద్దుకోవ‌డంపై పెద్దగా దృష్టిపెట్ట‌ని లోకేష్‌... పార్టీపైనే ఆధిప‌త్యం చెలాయించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం బాబుకు కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా లోకేష్ జోక్యం మొదలైంద‌ట‌. కర్నూలులో అభ్యర్థులు అంటూ లోకేష్ చేసిన ప్రకటన బ‌య‌టే కాదు - నారా ఇంట కూడా పెద్ద దుమారాన్నే రేపింది అంటున్నారు. నేను ఉండ‌గానే ఇలా చేయ‌డం స‌రైన‌దేనా అని బాబు నొచ్చుకున్న‌ట్లు చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నిక‌ల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో యువతకు ప్రాధాన్యతను ఇవ్వాలని - సీనియర్లను పక్కన పెట్టేయాలనేది లోకేష్ లెక్కగా తెలుస్తోంది. అయితే బాబు మాత్రం సీనియర్లను పక్కన పెట్టడానికి అయిష్టతతో ఉన్నాడట. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్యన విబేధాలు పొడసూపాయని సమాచారం.

మరోవైపు బ్రహ్మణి కూడా తన భర్తను పెద్ద పోస్టులో చూసుకోవాలని అనుకుంటోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏ భార్య అయినా పెళ్ల‌య్యాక త‌న భ‌ర్త ఎద‌గాల‌నుకుంటుంది. ఆమె కూడా స‌గ‌టు మ‌నిషే క‌దా. రేపటి ఎన్నికల తర్వాత తండ్రి తప్పుకుని.. పార్టీ గెలిస్తే తన భర్తకు సీటును అప్పగించేయాలని కూడా బ్రహ్మణి కోరుకుంటోంద‌ట‌. అయినా సీఎం వైఫ్ అనిపించుకోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు? ఏదేమైనా టీడీపీలో ఎన్న‌డూ లేని ప‌రిస్థితి కనిపిస్తోంది. అస‌లే జ‌గ‌న్ హ‌వా న‌డుస్తున్న స‌మ‌యంలో ఇలాంటి అంత‌ర్గ‌త స‌మస్య‌లు పార్టీని వేధిస్తే... ఇక గ‌ట్టెక్క‌డం ఖాయ‌మని సీనియ‌ర్లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.

కొస‌మెరుపు - ఈ మ‌ధ్య టీడీపీ నారా హ‌మారా నినాదం మొదలెట్టింది. అంటే నంద‌మూరి ముద్ర‌ను పార్టీపై చెరిపేయాల‌ని ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే బాల‌య్య‌కూ కోపం వ‌చ్చిందేమో.