Begin typing your search above and press return to search.

‘ఏపీ భవన్’ ఇష్యూలో కేసీఆర్ కు నిరాశే

By:  Tupaki Desk   |   8 Sep 2016 6:44 AM GMT
‘ఏపీ భవన్’ ఇష్యూలో కేసీఆర్ కు నిరాశే
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరాశకు గురయ్యే ఉదంతం చోటు చేసుకుంది. ఆయన ఆశలకు భిన్నంగా కేంద్రం వ్యవహరించింది. తాను ఇష్టపడింది.. తాను కోరుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలన్న పట్టుదల ఎక్కువగా ఉండే కేసీఆర్ కు తాజాగా చోటు చేసుకున్న పరిణామం అసంతృప్తికి గురి కావటం ఖాయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆస్తుల్ని జనాభా ప్రాతిపదికన పంచుకోవటం తెలిసిందే. దీనికి తగ్గట్లే ఢిల్లీలోని ఏపీ భవన్ ను కూడా రెండుగా చేసి.. రెండురాష్ట్రాలవారు వినియోగిస్తున్నారు.

అయితే.. ఏపీ భవన్ నిజాం ఆస్తి అని.. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందంటూ ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించటం తెలిసిందే. కేసీఆర్ వాదనకు ఏపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆస్తుల్ని విడిపోయిన తర్వాత ఎలా పంచుకోవాలన్నది ఒకే ప్రాతిపదికన ఉండాలే కానీ.. ఒక్కొక్కటి ఒక్కోలా ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీ భవన్ నిజాం ఆస్తి కాబట్టి.. అది తమకే చెందాలని వాదిస్తే.. ఉమ్మడి రాష్ట్రానికి ముందు.. ఏపీలో ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు ఇవ్వలేదన్న ప్రశ్నలు వినిపించాయి.

దీంతో.. ఈ అంశంపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్ తో పాటు ఇతర ఆస్తుల్ని ఎలా పంచుకోవాలన్న అంశం మీద కేంద్ర హోంశాఖ ఒక స్పష్టత ఇచ్చేసింది. మిగిలిన ఆస్తుల మాదిరే ఏపీ భవన్ ను కూడా జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీ భవన్ తో పాటు.. మిగిలిన ఆస్తుల్ని ఎలా పంచుకోవాలన్న అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చేయటం గమనార్హం. మరీ.. అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.