Begin typing your search above and press return to search.

ఏపీ భవన్ పంచాయితీకి మూహూర్తం ఖరారు!

By:  Tupaki Desk   |   17 Sep 2016 7:38 AM GMT
ఏపీ భవన్ పంచాయితీకి మూహూర్తం ఖరారు!
X
ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ ను విభజించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలు ఏపీ భవన్ పంచాయతీకి తెరతీసాయి. ఏపీ భవన్ పరిధిలో ఉన్న ఏడెకరాల హైదరాబాద్ హౌజ్ తెలంగాణకు చెందినది కాబట్టి, ఆ స్థాలాన్ని మినహాయించి మిగిలిన భూమిని పంపకాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఏపీనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర హోం శాఖ ముహూర్తం నిర్ణయించింది.

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏపీ భవన్ ఆస్తుల వ్యవహారంపై ఇరు రాష్ట్రాల సీఎస్‌ లతోనూ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్ర హోం శాఖ. ఈమేరకు సెప్టెంబరు 23న ఢిల్లీకి రావాలని ఇద్దరు రాష్ట్రాల సీఎస్ లకు ఇప్పటికే సమాచారం అందిందట. కాగా.. ఢిల్లీలోని ఇండియా గేట్ పక్కన సుమారు 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ భవన్‌ ను నిర్మించారు. అయితే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఏపీ భవన్‌ ను ఆనుకుని ఉన్న హైదరాబాద్ హౌస్‌ ను కేంద్రానికి అప్పగించారు. దీనికి బదులుగా పటౌడీ హౌస్ పరిధిలోని ఏడు ఎకరాలను ఏపీ భవన్‌ కు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈ ఏడు ఎకరాల భూమి మీదనే ఏపీ - తెలంగాణల మధ్య వివాదం నెలకొంది.

అంటే... మొత్తం ఏపీ భవన్ పేరున ఉన్న 19.5 ఎకరాలను జనాభా ప్రాతిపధికన పంచాలని ఏపీ వాదిస్తుంటే.. 7 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ హౌస్ తెలంగాణకు చెందినది కావడం వల్ల దాన్ని మినహాయించి మిగిలిన 12.5 ఎకరాలను జనాభా ప్రాతిపధికన పంచాలనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఈ విషయంపై మాట్లాడటానికే తెలంగణ - ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీలను ఈ నెల 23న ఢిలీకీ రావాల్సిందిగా కేంద్ర హోంశాఖ పిలుపునిచ్చింది.