Begin typing your search above and press return to search.

సింపుల్ గా విడిపోతున్నారు

By:  Tupaki Desk   |   6 Jan 2016 5:30 PM GMT
సింపుల్ గా విడిపోతున్నారు
X
వెయ్యి అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయాలంటారు... పెళ్లి చేయడమనేది ఎంతో బృహత్ కార్యక్రమం. కానీ, అంత ప్రయాస పడి చేసే పెళ్లిళ్లను సింపుల్ గా పెటాకులు చేసుకుంటున్నాయి కొన్ని జంటలు. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్య్రం పేరిట వెర్రి తలలు వేస్తూ వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలా విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. చుట్టాలు, స్నేహితులు అందరినీ పిలిచి ఎంతో గ్రాండ్ గా జరుపుకునే పెళ్లిళ్లు సింపుల్ కారణాలతో పెటాకులవడం బాధాకరమే.

ఉమ్మడి కుటుంబాలకు పెట్టింది పేరైన భారత దేశంలోనూ మారుతున్న కాలంలో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే ఉంటున్నాయి. ఉద్యోగం - చదువు - ఇతర అవసరాల కోసం ఎవరికివారు చిన్నకుటుంబాలుగా ఉంటున్నారు. పెళ్లయిన వారం రోజులకే భార్యను తీసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో అక్కడ కొత్త దంపతుల మధ్య చెలరేగే చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే పెద్దలు కరవవుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య ఏ చిన్న తగువు వచ్చినా అది చిలికి చిలికి గాలి వానగా మారి వివాహ వృక్షాన్ని కూల్చేస్తుంది. ఇండియాలో ఇంతకాలం చాలా స్వల్పంగా ఉన్న విడాకుల సంస్కతి ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతోంది. పరిష్కారమే లేదు అనే సమస్యలు ఉద్భవించినపుడు విడాకులు కోరుకోవడంలో తప్పులేదు. అయితే ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న విడాకుల కేసుల్లో చాలా వరకు కాసేపు కూర్చుని మాట్లాడుకుంటేనో, కాస్తంత పట్టువిడుపులు ప్రదర్శిస్తోనో పరిష్కారమయ్యేవే.

విడాకులు కోరుకుంటూ కోర్టుకెక్కుతున్న వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతున్నట్లు ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. ఈ ధోరణి చదువుకున్న వారు, మెట్రోల్లో జీవిస్తున్న సంపన్న, వర్గాలతో పాటు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టుల్లోనే విడాకుల కోసం 14,850 మంది దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విడాకులు ఆ దంపతుల జీవితాలనే కాదు, వారి పిల్లల జీవితాలనూ ప్రభావితం చేస్తాయి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి ప్రేమ పిల్లలకు దూరమైనా వారిలో విపరీతమైన మానసిక సంఘర్షణ నెలకొంటోందని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మనూన్యతకు లోనయి రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు మామూలు పిల్లలతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. దొంగతనాలు చేయడం, హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు వంటి వాటికి పాల్పడుతూ జైలు పాలవుతున్నవారిలో ఎక్కువ మంది ఇలాంటివారుంటున్నారని గణాంకాలు చెప్తున్నాయి. దంపతుల మధ్య సర్దుబాటు ధోరణి లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు సమాజాన్ని ఇంతగా ప్రభావం చేస్తున్నాయన్న మాట.