Begin typing your search above and press return to search.

అన్ని మతాలకి ఒకే భరణం, విడాకుల నియమాలు.. పరిశీలనకు సుప్రీం అంగీకారం !

By:  Tupaki Desk   |   17 Dec 2020 9:56 AM GMT
అన్ని మతాలకి  ఒకే భరణం, విడాకుల నియమాలు.. పరిశీలనకు  సుప్రీం అంగీకారం !
X
మతంతో, లింగంతో సంబంధం లేకుండా వివాహ వివాదాలకు సంబంధించి చెల్లించే భరణం అందరికీ ఒకేలా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఈ మద్యే ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర హోంశాఖ, లా అండ్‌ జస్టిస్‌, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. విడాకులకు సంబంధించి భరణం చెల్లించే అంశంలో మతం, జాతి, కులం, లింగం, జన్మించిన ప్రాంతం వంటి అంశాలను బట్టి కొన్ని భేదాలు ఉన్నాయని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టు లో ఓ పిటిషన్‌ వేశారు.

ఈ నిబంధనలు రాజ్యాంగ స్పూర్తికి, అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే వాటిని రద్దు చేసి, చెల్లించే భరణం విషయంలో భారత పౌరులందరినీ సమానంగా చూసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. కులం , మతం. లింగం ఆధారంగా కాకుండా అందరికి ఒకే రకమైన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. మతాలకు అతీతంగా విడాకులకు ఏకరీతి కారణాలు సూచించాలని కేంద్ర న్యాయ కమిషన్‌ ను కోరే అంశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించింది. ఇవి రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, వివక్ష వ్యతిరేక హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగత చట్టాలు సమానత్వ హక్కులను రక్షించలేవని పిటిషనర్‌ తరుపున సీనియర్‌ న్యాయవాది పింకీ ఆనంద్‌ వాదించారు. వీటిని పరిశీలించడానికి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.