Begin typing your search above and press return to search.

దివాళీ స్పెషల్ స్వీట్స్: కేజీ @ 25 వేలు.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Nov 2021 3:58 AM GMT
దివాళీ స్పెషల్ స్వీట్స్: కేజీ @ 25 వేలు.. ఎందుకో తెలుసా?
X
దేశమంతా దీవాళీ సందడి నెలకొంది. గతేడాది కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన దీపావళి వేడుకలు... ఈ సారి ఘనంగా జరుపుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇక ఈ పండుగ స్పెషల్ స్వీట్లు. పండుగ రోజున లక్ష్మి దేవీకి పూజలు చేస్తారు. సాయంత్రం వేళ టపాకాయలు కాలుస్తూ ఉత్సాహంగా జరుపుకుంటారు. బంధుమిత్రలకు మిఠాయిలు పంచుకుంటారు. అందుకే దీవాళి వచ్చిందంటే చాలు స్వీట్ల షాపులు కళకళలాడుతాయి. పండుగ కోసం ప్రత్యేకమైన మిఠాయిలను కూడా తయారు చేస్తారు దుకాణ యజమానులు. గుజరాత్ లోని ఓ స్వీట్ షాపులో గోల్డెన్ పిస్తాచియో బాల్, గోల్డెన్ పిస్తాచియో డెస్టర్ అనే ప్రత్యేక మిఠాయిలను తయారు చేశారు. మహారాష్ట్రలో స్వర్ణ కలష్ అనే స్పెషల్ స్వీట్ ను దీపావళి కోసం తయారు చేశారు. అయితే వీటిని కేజీ రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నారు.

ఎందుకంత ధర..?

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని ఓ స్వీట్ షాపు నిర్వాహకులు దీపావళి కోసం ప్రత్యేకంగా గోల్డెన్ పిస్తాచియో బాల్, గోల్డెన్ పిస్తాచియో డెస్టర్ తయారు చేశారు. వీటిని అధిక ధరకు అమ్ముతున్నారు. కేజీ రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు మిఠాయి దుకాణ యజమాని జై శర్మ వెల్లడించారు. ఈ స్వీట్లను అత్యంత ఖరీదైన నౌజా డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగిస్తారు. మామ్రా ఆల్మండ్ ను కూడా వినియోగిస్తారు. వాటిని ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి కేజీ రూ.6వేల చొప్పున దిగుమతి చేసుకుంటారు. అంతేకాకుండా ఈ స్వీటులో 24క్యారెట్ల బంగారు పూత ఉంటుంది. ఇకపోతే వీటిని తయారు చేయడానికి స్పెషల్ చెఫ్ లు ఉంటారు. టర్కీ నుంచి పిలిపించి మరీ ఈ స్పెషల్ స్వీట్స్ ను తయారు చేయిస్తామని యజమాని జై శర్మ తెలిపారు. అందుకే ఈ స్వీట్ల ధరను రూ.25 వేలుగా నిర్ణయించామని పేర్కొన్నారు. అంతేకాకుండా దాదాపు రెండు నెలల వరకు ఈ స్వీట్లు పాడవకుండా ఉంటాయని వెల్లడించారు.


డిమాండ్ ఎలా ఉంది..?

అమ్మో ఇంత ధర వెచ్చించి ఎవరు కొంటారు అనుకుంటున్నారా..? ధరతో సంబంధం లేకుండా ఈ గోల్డెన్ పిస్తాచియో బాల్, గోల్డెన్ పిస్తాచియో డెస్టర్ స్వీట్లను కొనడానికి వినియోగదారులు తరలివస్తున్నారని దుకాణ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా వారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ఈ మిఠాయిలను ఇప్పటికే పది లక్షలకు పైగా విక్రయించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లోనూ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ స్వీట్ల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బంగారు పూతతో చూడగానే నోరూరించేలా ఉన్నాయి ఈ స్పెషల్ స్వీట్స్.

స్వర్ణ కలష్ స్పెషల్

దీవాళి వేళ మహారాష్ట్ర రాష్ట్రంలోని అమరావతిలోని ఓ స్వీట్ షాపులో స్వర్ణ కలష్ మిఠాయిని తయారు చేశారు. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారైన ఈ స్వీట్ భారీ ధర పలుకుతోంది. కేజీ రూ.11 వేల చొప్పున విక్రయిస్తున్నారు. మొత్తం 12 వేల కేజీల స్వీట్లను తయారు చేసినట్లు ఆ షాపు యజమాని తేజస్ పోపత్ తెలిపారు. ఇప్పటివరకు 7 కేజీల స్వీట్లను విక్రయించినట్లు వివరించారు. పూర్తిగా బంగారు పూతతో ఉండే ఈ స్వీట్లను తయారు చేయడానికి రాజస్థాన్ నుంచి చెఫ్ లను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.