Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ‘దమ్ము’ ఛాలెంజ్ విసిరిన డీకే

By:  Tupaki Desk   |   4 Sep 2016 5:59 AM GMT
కేసీఆర్ కు ‘దమ్ము’ ఛాలెంజ్ విసిరిన డీకే
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దూకుడెక్కువ అంటారు. కానీ.. ఆయన కంటే రెండాకులు ఎక్కువన్నట్లుగా కనిపించే నేతలు కొద్దిమంది ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీమంత్రి డీకే అరుణ వ్యవహారశైలే వేరుగా ఉంటుంది. ఆమె మాటలు తూటాల్లా పేలుతుంటాయి. విషయం ఏదైనా సరే..ఆమె కానీ నోరు విప్పారంటే సంచలనమే. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటమే కాదు.. ఆమె విసిరే సవాళ్లు సంచలనంగా ఉంటాయి. తాజాగా ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలకు తోడుగా రెండు కొత్త జిల్లాల్ని (గద్వాల్.. జనగామ) ఏర్పాటు చేయాలంటూ ఆమె రెండు రోజుల దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మహా ఒప్పందం కుదుర్చుకొని వచ్చిన సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ దగ్గర కేసీఆర్ విసిరిన సవాలు మాదిరే ఆమె కూడా సవాలు చేయటం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటం విశేషం. ‘‘సీఎం కేసీఆర్. దమ్ముంటే రా. నువ్వొస్తావో..కొడుకునే పంపిస్తావో.. అల్లుడ్నే పంపుతావో.. కూతురికి చెబుతావో.. ఎవరో ఒకరు రండి. మా ముందు వాస్తవాలు చెప్పండి. ఏ ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేశారో వివరించండి. మా మాటలు తప్పని చెప్పండి. వీథి రౌడీలా బేగంపేట ఎయిర్ పోర్ట్ లో సవాలు విసరటం కాదు. దమ్ముంటే ముందు రోజే ఆ విషయాన్ని చెప్పాల్సింది. నా దగ్గర ఉన్న కాగితాలు పట్టుకొస్తా. మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకురమ్మనాల్సింది. ముఖ్యమంత్రి స్థాయి మరిచి..మా ఉత్తమ్ కుమార్ కు సవాల్ విసిరావు. ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా. రేపు సాయంత్రం వరకూ ఇక్కడే ఉంటా. దమ్ముంటే జిల్లాల ఏర్పాటులో మీరు ప్రజాభిష్టం మేరకు నడుచుకున్నామని.. శాస్త్రీయంగా పునర్విభజన చేశామని నిరూపించండి’’ అంటూ దమ్ము సవాలు విసిరారు.

ఓపెన్ ఛాలెంజ్ అన్నట్లుగా డీకే అరుణ విసిరిన సవాలు తీవ్రంగా ఉండటంతో పాటు.. ఆమె చేసిన విమర్శలు కూడా తీవ్రస్థాయిలో ఉండటం గమనార్హం. ‘‘ఏ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేశారో కేసీఆర్ స్పష్టం చేయాలి. జనాభా ప్రాతిపదికనా? భౌగోళిక పరిసరాలు.. వనరులు పరిగణలోకి తీసుకున్నారా? చారిత్రక నేపథ్యం చూశారా? సౌకర్యాలు ఆరా తీశారా? నీళ్లా.. రహదారులా? రవాణా? ఏప్రాతిపదికన చూసినా గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సిన హంగులు ఉన్నాయి. గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు ఎంతో కాలంగా మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరి.. డీకే అరుణ చేసిన సవాలుకు కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.