Begin typing your search above and press return to search.

అసెంబ్లీ రద్దు అన్యాయం.. డీకే అరుణ పిటీషన్

By:  Tupaki Desk   |   8 Oct 2018 10:57 AM GMT
అసెంబ్లీ రద్దు అన్యాయం.. డీకే అరుణ పిటీషన్
X
తెలంగాణ అసెంబ్లీని ఏకపక్షంగా రద్దు చేశారని.. రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గద్వాల తాజామాజీ ఎమ్మెల్యే డీకే అరుణ హైకోర్టుకెక్కారు. ఈ మేరకు హైకోర్టులో సోమవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. కేబినెట్ నిర్ణయంతో శాసనసభను రద్దు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. శాసనసభకు సమాచారం ఇవ్వకుండా, 9 నెలలు ముందుగా రద్దు చేయడం సభ్యుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. శాసనసభను సమావేశపరిచకుండా రద్దు చేయడం సభ్యుల హక్కులు కాలరాయడమేనని డీకే అరుణ పేర్కొన్నారు.

హైకోర్టులో పిటీషన్ వేసిన అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.. అసెంబ్లీ రద్దుకు ముందు శాసనసభను సమావేశపరిచి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోవాలని.. కానీ కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా నిరంకుశంగా అసెంబ్లీని రద్దు చేయడం కుదరదని.. గవర్నర్ కూడా అసెంబ్లీ రద్దు సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదనను పరిగణలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు. శాసనసభను సమావేశపరచమని గవర్నర్ కూడా కోరలేదని తెలిపారు. శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం పిటీషన్ వేశామని డీకే అరుణ చెప్పారు. ఈ అనైతిక అసెంబ్లీ రద్దుపై సుప్రీంలో ఇదివరకే పిటీషన్ దాఖలైతే హైకోర్టులో వేయమని సూచించారని.. అందుకే వేశామని తెలిపారు.

డీకే అరుణ అసెంబ్లీ రద్దుపై వేసిన పిటీషన్ ను ఉమ్మడి హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో దీనిపై విచారణ జరపనుంది. దీంతో హైకోర్టు ఏం నిర్ణయం వెలువరుస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే తెలంగాణ ఓటర్ల జాబితాపై పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఓటర్ల జాబితాపై పిటీషన్ వేసిన వారిలో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఓటర్ల జాబితాపై ఈసీ ఈరోజు కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. అనంతరం హైకోర్టు ఈ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇప్పుడు అసెంబ్లీ రద్దు నిర్ణయంపై మరో కాంగ్రెస్ నేత డీకే అరుణ పిటీషన్ వేయడంతో తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముందుకు సాగుతాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

డీకే అరుణ పిటీషన్ పై టీఆర్ఎస్ అగ్ర నేతలు మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల్లో పోటీచేస్తే ఓడిపోతామనే కాంగ్రెస్ నేతలు ఇలా హైకోర్టు ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.