Begin typing your search above and press return to search.

ఏదో విధంగా టీ.లో ప్రాంతీయవాదాన్ని వినిపిస్తున్నారు!

By:  Tupaki Desk   |   20 Jan 2015 8:55 AM GMT
ఏదో విధంగా టీ.లో ప్రాంతీయవాదాన్ని వినిపిస్తున్నారు!
X
ఉత్తరతెలంగాణ, దక్షిణ తెలంగాణ.. ఏదో విధంగా ఈ తేడాను హైలెట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలు. ప్రత్యేకించి ఈ విషయంలో దక్షిణ తెలంగాణ ప్రాంత నేతలు ముందున్నారు. వీరు తమ ప్రాంతానికి అన్యాయం జరిగిపోతోందని.. కేసీఆర్‌ పాలనతో అయినవన్నీ ఉత్తరతెలంగాణకే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లుగా పలువురు నేతలు ఉత్తర, దక్షిణ తెలంగాణ తేడాలనుందుకొని మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్‌ నేతలు డీకే అరుణ, చిన్నా రెడ్డి, తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి వంటి దక్షిణ తెలంగాణ వాసులు తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని మాట్లాడిన వారిలో ముఖ్యులు.

మరి ఇప్పటి వరకూ కేటాయింపులు, అభివృద్ధి వంటి అంశాల గురించి మాట్లాడుతూ తమకు అన్యాయం జరిగిపోతోందని వీరు విరుకచుకుపడే వారు. అయితే ఇప్పుడు వీరు మరో అడుగు ముందుకు వేశారు. తాజాగా డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఉత్తరతెలంగాణ జిల్లాల పర్యటనకు నాలుగైదు రోజులను కేటాయించే కేసీఆర్‌ దక్షిణ తెలంగాణలోని పాలమూరు పర్యటనను మాత్రం ఒక్క రోజులోనే ముగించేశాడని.. ఈ విధంగా ఆయన దక్షిణ తెలంగాణకు అథమ ప్రాధాన్యత ఇస్తున్నాడని అరుణ విరుచుకుపడ్డారు.

మరి ప్రతి వ్యవహారంలోనూ... ప్రతి పనిలోనూ ఇలాంటి తేడాలు చూడటం మొదలుపెడితే తెలంగాణలో మరో ప్రాంతీయ ఉద్యమం చాలా త్వరగా రాజుకొంటుందో ఏమో!