Begin typing your search above and press return to search.

ఆ గంట డీకే అరుణ మ‌న‌సును మార్చేసింద‌ట‌!

By:  Tupaki Desk   |   20 March 2019 5:09 AM GMT
ఆ గంట డీకే అరుణ మ‌న‌సును మార్చేసింద‌ట‌!
X
ఇవాల్టి రోజున మీడియానే కాదు.. సోష‌ల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌తి చిన్న విష‌యం మీద స్పందిస్తున్న తీరు ఒక రేంజ్లో ఉంటున్నాయి. నిప్పు లేకుండా పొగ రాద‌న్న‌ట్లు.. చిన్న అంత‌ర్గ‌త స‌మావేశాలకు సంబంధించిన అంశాలు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న వైనం క‌నిపిస్తోంది. దీనికి భిన్నంగా ఎక్క‌డా.. ఎవ‌రికి ఎలాంటి ఆలోచ‌న‌లు లేకుండా ఒక ముఖ్య‌నేత పార్టీ మారిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

పార్టీ వ‌ర్గాలు సైతం అంచనా వేయ‌లేని రీతిలో చోటు చేసుకున్న డీకే అరుణ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల్ని మీడియా.. సోష‌ల్ మీడియా గుర్తించే లోపే డీకే అరుణ కాంగ్రెస్ కండువాను తీసేసి.. గులాబీ కండువాను వేసుకోవ‌టం జ‌రిగిపోయాయి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాల‌న్న విష‌యంపై క‌మ‌ల‌నాథులు ఎంత క‌సిగా ఉన్నార‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ హైద‌రాబాద్‌ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న డీకే అరుణ నివాసానికి వెళ్ల‌టం.. కేవ‌లం గంట పాటు జ‌రిగిన మీటింగ్ అనంత‌రం ఆమె హుటాహుటిన ఢిల్లీకి ప‌య‌నం కావ‌టం.. దేశ రాజ‌ధానిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను క‌ల‌వ‌టం.. ఆయ‌న ఇచ్చిన హామీతో వెంట‌నే పార్టీ మారుతున్న విష‌యాన్ని ప్ర‌క‌టించ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వీట‌న్నింటికి రాంమాధ‌వ్ జ‌రిపిన గంట మీటింగ్ కీల‌క‌మ‌ని చెబుతున్నారు.

తెలంగాణ‌లో బీజేపీకి సంబంధించి స‌మూల మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీలోకి కొత్త నీటిని తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని బీజేపీ అధినాయ‌క‌త్వం గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ లోని కీల‌క నేత‌ల‌పై బీజేపీ అధినాయ‌క‌త్వం క‌న్నేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌మ‌ను త‌న‌కిష్ట‌మైన రీతిలో వాడేస్తున్న కేసీఆర్ కు స‌రైన రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో క‌మ‌లనాథులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ విష‌యంపై మోడీషాలు చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని.. దేశంలోని మ‌రే రాష్ట్రంలో ఎదురుకాని విచిత్ర‌మైన అనుభ‌వాలు తెలంగాణ విష‌యంలో ఎదురుకావ‌టంతో వారు.. తెలంగాణ మీద ప్ర‌త్యేక ఫోక‌స్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా ప‌డిన తొలి అడుగు డీకే అరుణ ఎపిసోడ్ గా చెబుతున్నారు. మొత్తంగా గంట వ్య‌వ‌ధిలో డీకే అరుణ మ‌న‌సు మొత్తాన్ని మార్చేలా రాంమాధ‌వ్ ఆమెకు ఇచ్చిన హామీ ఏమి ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రానున్న రోజుల్లో డీకే అరుణ త‌ర‌హాలో మ‌రికొంద‌రు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి.. వారెవ‌రో చూడాలి.