Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రభుత్వానికీ ఆమరణ దీక్ష సెగ..

By:  Tupaki Desk   |   16 Jun 2016 9:30 AM GMT
కేసీఆర్ ప్రభుత్వానికీ ఆమరణ దీక్ష సెగ..
X
ఏపీలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షతో టీడీపీ సర్కారుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముద్రగడ దీక్ష ప్రభావం ఇప్పుడు తెలంగాణలోనూ పడుతోంది. దీక్షతో ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టడంలో కొంతవరకు సఫలీకృతుడైన ముద్రగడను తెలంగాణలోని కొందరు నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముద్రగడ తరహాలోనే తమ డిమాండ్ల సాధనకు ఆమరణ దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారు. అవును.. మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే అరుణ ఆమరణ దీక్షకు రెడీ అవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అది సాధించడానికి ఆమె దీక్షకు దిగబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా గద్వాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ మహిళా నేత డీకే అరుణ తన డిమాండ్ ను సాధించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడమొక్కటే మార్గంగా భావిస్తున్నారు. ఇటీవలి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమావేశంలో గద్వాల పేరు వినిపించకపోవడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. యాదాద్రి - భద్రాద్రి జిల్లాలతో పాటు అలంపురంలో శక్తి పీఠంగా పూజలందుకుంటున్న జోగులాంబ పేరిట గద్వాల కేంద్రంగా 'జోగులాంబ' జిల్లాను ఏర్పాటు చేయాలన్నది ఆమె ప్రధాన డిమాండ్. కానీ కేసీఆర్ దాన్ని విస్మరించారు. కొత్త జిల్లాల్లో దానికి చోటు ఉన్నట్లుగా కనిపించకపోవడంతో డీకే అరుణ తన కార్యచరణ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గద్వాల లేదా హైదరాబాద్ లో ఆమె దీక్షకు దిగుతారని తెలుస్తోంది. త్వరలోనే ఆమె దీక్ష మొదలు కానుంది. అరుణ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను భర్త భరతసింహారెడ్డి స్వయంగా చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన డీకే అరుణ దీక్షకు దిగితే పరిణామాలు వేరేగా ఉంటాయని టీఆరెస్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అరుణ కూడా దీన్ని పెద్ద ఎత్తున చేపట్టి టీఆరెస్ ను ఇరుకునపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి కూడా ఆమరణ దీక్ష సెగ తగలనుందన్నమాట.