Begin typing your search above and press return to search.

కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది : డీకే అరుణ

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:30 PM GMT
కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది : డీకే అరుణ
X
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి బీజేపీ , టిఆర్ ఎస్ నేతల మధ్య పరస్పర విమర్శలు , ఆరోపణలు ఎక్కువైయ్యాయి. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీఎం కేసీఆర్ కి ఓటమి భయం మొదలైంది అని , అందుకే దొంగ లెటర్లు సృష్టించి , తమ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ ‌కు రోజూ సరిగా నిద్ర కూడా పట్టడం లేదన్నారు. భాగ్యనగర ప్రజలపై టీఆర్ ఎస్ పార్టీకి ప్రేమ లేదని చెప్పారు. టిఆర్ ఎస్ ఇచ్చే వరద సాయం రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయన్నారు. ఓట్ల కోసమే ఎలాంటి లెక్క లేకుండా పైసలు పంపిణీ చేశారన్నారు. వరద సాయం రూ.550 కోట్లిచ్చిందన్నారు. డబ్బులు అకౌంట్లో వేయకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబులో వేశారన్నారు.

రూ.10 వేలు అర్హులకు ఇచ్చాకే ఎన్నికల నోటిఫికేషన జారీ చేయాల్సి ఉంటే బాగుండేదని, నోటిఫికేషన్ ఇచ్చింది మీరే..వరద సాయం ఆపింది మీరే అంటూ మండిపడ్డారు. ఓటమి భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. ఎన్నికలయ్యాక వరద సాయం రూపాయి కూడా ఇవ్వరన్నారు. కేసీఆర్ కు కావాల్సింది జనాలు కాదు ఓటర్లు అంటూ విమర్శలు కురిపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దేశాన్ని అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఎంఐఎం లేకుంటే కేసీఆర్ కు దిక్కే లేదన్నారు. అభివృద్ధి చేస్తే ఇండ్లల్లకు నీళ్లెట్ల వచ్చాయన్నారు. ఎంఐఎం ఏం చేసిందో ముస్లీం సోదరులు ఆలోచించాలన్నారు. గ్రేటర్ లో బీజేపీ దే విజయం అని , టిఆర్ఎస్ పతనం మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.