Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ తో కాంగ్రెస్ లాలూచీ...అందుకే బీజేపీలోకి

By:  Tupaki Desk   |   20 March 2019 4:27 PM GMT
టీఆర్ ఎస్‌ తో కాంగ్రెస్ లాలూచీ...అందుకే బీజేపీలోకి
X
కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పి కాషాయ కండువా క‌ప్పుకొన్న ఫైర్‌ బ్రాండ్ నేత డీకే అరుణ తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ - ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో పార్టీలో చేరిన అరుణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ లో కలుపుగోలుతనం లేదని - బలమైన నాయకుల్ని అణచివేస్తున్నారని ఆరోపించారు. తెరాసతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని దుయ్య‌బ‌ట్టారు. అంత‌ర్గత‌ రాజ‌కీయాలు - ఒంటెత్తు పోక‌డ‌ల‌తో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందని పేర్కొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా భరోసా ఇవ్వలేకపోతోందని డీకే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతోందని - టీఆర్‌ ఎస్‌ కి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆమె తెలిపారు.

కాంగ్రెస్‌ లో బలంగా ఉన్న నేతల్ని టీఆర్‌ ఎస్ నేతలు బలహీనపరుస్తున్నారని అరుణ ఆరోపించారు. అలా బలహీన పడుతోన్న పార్టీలో ఉండి సేవ చేయలేమనే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరుతున్నానని ఆమె ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ ద్వారానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ పార్టీ అని - చాలా బలమైన నాయకత్వంలో ముందుకు సాగుతోందని అన్నారు. తాను రాబోయే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న‌ట్లు అరుణ ప్ర‌క‌టించారు. పార్టీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని - కానీ మహబూబ్ నగర్ నుంచే పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని డీకే అరుణ తెలిపారు.

కాగా, ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ అభ్య‌ర్థిగా వంశీచంద‌ర్ రెడ్డిని పార్టీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు. ఈనెల 21వ తేదీన టీఆర్ ఎస్ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. కాగా, బీజేపీ జాబితా సైతం అదే రోజున వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.