Begin typing your search above and press return to search.

డ్రగ్ రాకెట్లో పెద్ద చేపల సంగతేంటి?

By:  Tupaki Desk   |   24 July 2017 11:35 AM GMT
డ్రగ్ రాకెట్లో పెద్ద చేపల సంగతేంటి?
X
టాలీవుడ్లో డ్రగ్ రాకెట్ కుంభకోణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హడావుడి చేయడం తప్పితే.. సాధిస్తోంది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి డీకే అరుణ. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ శాఖ 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు నోటీసులిచ్చి.. వారిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా చిన్న చేపల్ని వేటాడటం లాంటిదే అని.. పెద్ద తిమింగలాల్ని ప్రభుత్వం వదిలేసిందని ఆమె ఆరోపించారు.

డ్రగ్స్ కుంభకోణంలో దొరికిన టాలీవుడ్ పెద్దలు.. వారి పిల్లల పేర్లను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టకుండా దోబూచులాడుతోందని అరుణ ప్రశ్నించారు. 12 సంవత్సరాల వయసున్న స్కూలు చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసలైపోతున్నారని.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇటీవలి పరిణామాలే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. డ్రగ్ రాకెట్ ను నాశనం చేయడానికి ప్రయత్నం చిత్తశుద్ధితో పని చేయట్లేదని ఆమె విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటల గారడీతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారని అరుణ విమర్శించారు. కేసీఆర్ కు పాలన విషయంలో సరైన అనుభవం లేదని.. ఆయనో అసమర్థుడని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆమె అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అరుణ ధీమా వ్యక్తం చేశారు.