Begin typing your search above and press return to search.

దీక్షతో డీకే భావోద్వేగాన్ని రగులుస్తారా?

By:  Tupaki Desk   |   3 Sep 2016 7:18 AM GMT
దీక్షతో డీకే భావోద్వేగాన్ని రగులుస్తారా?
X
కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణ అధికారపక్షానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. కొంగొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల వరకూ ఓకే కానీ.. జిల్లా కావాలన్న గంపెడాశలో ఉన్న కొన్ని ప్రాంతాల వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ నిరసనల్ని పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారపక్షంపై పోరుబాటు చేపట్టాలని డిసైడ్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ. గద్వాలను జిల్లా చేయాలన్న తన డిమాండ్ కు కొత్తగా వరంగల్ జిల్లా జనగామను కూడా తన డిమాండ్ల జాబితాలో పెట్టుకున్న ఆమె దీక్ష బాట పట్టనున్న విషయం తెలిసిందే.

మొదటినుంచి గద్వాల్ జిల్లా కోసం పోరు చేస్తున్న డీకే అరుణ.. పనిలో పనిగా.. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్న జనగామ జిల్లా డిమాండ్ పైనా స్పందించటమే కాదు.. ఆ జిల్లా కోసం నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు సాగే ఈ దీక్షతో తెలంగాణ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల ఏర్పాటు మీద పలు వాదనలు వినిపించినా.. వాటిని జిల్లాలుగా చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా లేరనే చెప్పాలి.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో గద్వాల్.. జనగామ జిల్లాలు లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు జిల్లా అయ్యే అవకాశం మిస్ అయితే.. మళ్లీ ఇంకెప్పటికీ సాధ్యం కాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే.. పోరుబాటతో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో డీకే అరుణ ఉన్నారు. అందుకే ఈ వ్యవహారం మీద ఆమే స్వయంగా రంగంలోకి దిగారు. డీకే అరుణకు తోడుగా.. జనగామ జిల్లా డిమాండ్ ను మీద వేసుకున్న మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా దీక్ష బాట పడుతున్నారు.

జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉండటంతో పాటు.. అడ్డగోలుగా చేస్తున్నారన్న విమర్శను వారు బలంగా వినిపిస్తున్నారు. అన్ని సౌకర్యాలు.. భౌగోళిక సౌలభ్యం.. చారిత్రక నేపథ్యం ఉన్న గద్వాలను జిల్లాను చేయాలన్న డిమాండ్ తో పాటు.. అదే విధంగా జనగామను జిల్లా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. దీక్ష చేపడుతున్నారు. రెండు కొత్త జిల్లాల మీద చేస్తున్న నిరసన దీక్షతో భావోద్వేగాన్ని రగిలించి కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయాలని డీకే అరుణ భావిస్తున్నారు. మరి.. ఆమె ఎంత వరకూ విజయం సాధిస్తారో చూడాలి.