Begin typing your search above and press return to search.

ఆ మాటకే ఆయనకు రూ.204 కోట్ల పరువు పోయిందట

By:  Tupaki Desk   |   5 Aug 2019 10:45 AM GMT
ఆ మాటకే ఆయనకు రూ.204 కోట్ల పరువు పోయిందట
X
మిగిలిన కేసుల సంగతి ఎలా ఉన్నా పరువు నష్టం దావా వేయటం అంత తేలికైన విషయం కాదు. పరువు నష్టం కేసు వేయాలంటే.. అందుకు చెల్లించాల్సిన ఫీజు లెక్క ఖరీదు ఎక్కువే. అందుకు తమ మీద చేసే ఆరోపణలు.. విమర్శలపైన నేతలు పలువురు ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టి తిట్టేస్తారు.. మరింత ఘాటుగా రివర్స్ లో దూషణభూషణలకు పాల్పడతారే తప్పించి.. పరువు నష్టం దావాలు వేసే వారు చాలా తక్కువగా కనిపిస్తారు. చాలా అరుదుగా మాత్రమే పరువు నష్టం దావా వేస్తుంటారు.

తాజాగా పరువునష్టం దావా వేసి వార్తల్లోకి వచ్చారు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్. పార్టీకి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ మాదిరి పని చేసే ఆయన.. తాజాగా తనపై వచ్చిన ఆరోపణ విషయంలో తీవ్రంగా ఫీలయ్యారు. ఇంత మాట తనను అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఏకంగా రూ.204 కోట్ల పరువునష్టం దావా వేసి సంచలనంగా మారారు.

దీనికి కారణం లేకపోలేదు. పరువు నష్టం దావా అన్నంతనే.. చెల్లించాల్సిన ధరావస్తు సొమ్మే భారీగా ఉంటుంది. తాజాగా శివకుమార్ తన దావా వేయటానికి వీలుగా కోర్టుకు రూ.1.04 కోట్ల మొత్తాన్ని చెల్లించారు. ఇంతకీ ఆయన అంత ఫీలయ్యే మాట ఏమన్నారు? ఎవరన్నారు? అన్నది చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.

తెలుగు రాష్ట్రాల్లోరాజకీయ నేతల మధ్య సాగే తిట్లు.. విమర్శలు.. ఆరోపణలతో పోలిస్తే.. డీకే శివకుమార్ మీద వేసిన నింద చాలా చిన్నదనే చెప్పాలి. శివకుమార్ తన మీద ఉన్న ఐటీ.. ఈడీ కేసుల్ని వదిలించుకోవటానికి వీలుగా బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లగా విజయపుర ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు రాజకీయాల్లో చాలా కామన్.

కానీ.. శివకుమార్ మాత్రం తీవ్రంగా ఫీలై సదరు బసవగౌడ్ పై ఏకంగా రూ.204 కోట్ల మేర తన పరువుకు భంగం వాటిల్లినట్లుగా పేర్కొన్నారు. డీకే శివకుమార్ మాదిరి ఫీలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు నేతలు ఎంతమంది ఎన్ని వేల కోట్లకు పరువునష్టం దావాలు వేయాలో?