Begin typing your search above and press return to search.

ఏపీకి బాబే దిక్కు... మరి పవన్ ఆశలు...?

By:  Tupaki Desk   |   22 Dec 2022 1:30 PM GMT
ఏపీకి బాబే దిక్కు... మరి పవన్ ఆశలు...?
X
ఏపీ ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. దివాళా అంచులో ఉంది. ఏపీ విషయం జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇండైరెక్ట్ గా అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఒక రాష్ట్రం ఉంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఏపీ గురించే అని అంతా అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీ అప్పులు ఇప్పటికి ఎనిమిదిన్నర లక్షల కోట్లుగా ఉన్నాయని 2024 నాటికి అవి పది లక్షల కోట్లుగా చేరిపోతాయని అంటున్నారు.

మరి ఏపీ వార్షిక బడ్జెట్ చూస్తే రెండున్నర లక్షల కోట్లు ఉంటే అప్పులు నాలుగు రెట్లు ఉంటే ఏ రాష్ట్రం తట్టుకుంటుంది. దాంతో ఏపీ అప్పుల కుప్ప అవడం ఖాయమని అంతా అంటున్నారు. ఏపీకి ఆదాయం వస్తున్నా ప్రభుత్వ ప్రాధామ్యాల వల్లనే ఈ పరిస్థితి అని కూడా అంటున్నారు. వచ్చిన దాన్ని వచ్చినట్లుగా పధకాలకు ఖర్చు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. రేపటి రోజున మరోసారి వైసీపీ నెగ్గినా అప్పులు చేసి మరీ పంచుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు అన్న భయాలు అందరిలో ఉన్నాయి.

దాంతో ఏపీని దేవుడు కూడా కాపాడలేడు అన్న మాటలను రాజకీయంగా తలపండిన డీఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు అంటున్నారు. ఏపీని బాగు చేయాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని ఆయన అంటున్నారు. ఈ సందర్భంగా బాబు సామర్ధ్యాన్ని ఆయన ఉదాహరణతో చెప్పారు. 1994లో ఎన్టీయార్ మూడవసారి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పధకాల పేరు మీద పెద్ద ఎత్తున ఖర్చు చేయడం వల్ల ఏడాదికే రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులో పడిందని, అపుడు 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీని గాడిన పెట్టారని, మళ్ళీ అభివృద్ధి పధంలో నడిపించారని ఆయన గుర్తు చేశారు.

అందువల్ల చంద్రబాబు వస్తే మాత్రం ఏపీని కచ్చితంగా చక్కదిద్దుతారని ఆయన నమ్ముతున్నారు. ఇదే సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నిజాయతీపరుడని, అయితే ఆయనకు పరిపాలనా దక్షత లేదని అనేశారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధి కోసం పవన్ చంద్రబాబు కలసి పోటీ చేయాలని ఆయన అంటున్నారు. ముఖ్యమంత్రిగా మాత్రం చంద్రబాబు కావాల్సిందే అని ఆయన అంటున్నారు.

ఇక్కడే జనసేన నుంచి వ్యతిరేకత వస్తోంది. మా పవన్ కి పాలనాదక్షత లేదని అంటారా అని వారు డీఎల్ వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు. పవన్ పాలన దక్షత ఏంటో చూడాలంటే అధికారంలోకి వస్తే తెలుస్తుంది అని విశాఖ జిల్లాకు చెందిన జనసేన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ అంటున్నారు. పవన్ కళ్యాణ్ నిజాయతీని గురించి డీఎల్ మెచ్చుకోవడానిని వారి స్వాగతిస్తూనే ఈ మాటలను తప్పుపడుతున్నారు.

ఇక్కడ డీఎల్ అన్నారని కాదు సాధారణ జనంలో ఉన్న అభిప్రాయం ఏంటి అన్నది కూడా చూస్తే డీఎల్ మాదిరిగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే ఏపీ మళ్లీ ప్రగతిపధంలో నడుస్తుంది అన్న మాట అయితే సాదర జనంతో పాటు అందరిలో ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ మంచివారు అయినా మరికొంత కాలం ఆయన రాజకీయంగా ఉంటూ అనుభవం సంపాదించాలని సూచించేవారూ ఉన్నారు. ఇక ఈ రకమైన అభిప్రాయం కనుక గట్టిగా పెరిగితే మాత్రం చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశాలు మెరుగు అయినట్లే. అంతేకాదు రేపటి రోజున తెలుగుదేశం సింగిల్ గా పోటీ చేసినా కూడా గెలిచి సత్తా చాటుకుంటుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.