Begin typing your search above and press return to search.

జనవరి 3 తర్వాత అనూహ్య ఘటన తప్పదట.. వైఎస్ స్నేహితుడి మాట

By:  Tupaki Desk   |   22 Dec 2022 3:57 AM GMT
జనవరి 3 తర్వాత అనూహ్య ఘటన తప్పదట.. వైఎస్ స్నేహితుడి మాట
X
చెప్పాలనుకున్నది ఏదైనా ముఖం మీద చెప్పేసే తీరు ఉన్న కొద్దిమంది రాజకీయ నేతల్లో డీఎల్ రవీంద్రారెడ్డి ఒకరు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా.. ఆయనకు జిగిరీ దోస్తుగా ఉండే వారిలో డీఎల్ ఒకరు. సీనియర్ నేత అయిన ఆయన.. రాష్ట్ర విభజన ఎపిసోడ్ నాటి నుంచి రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉండటం తెలిసిందే.

తన మరణం వేళలోనూ తన భౌతికాయం మీద కాంగ్రెస్ జెండా తప్ప మరొకటి ఉండదంటూ మాటలు చెప్పే ఆయన.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన వైసీపీలో చేరారు. ప్రస్తుతం కూడా వైసీపీలోనే ఉన్న ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా అంతుకు మించిన షాకింగ్ గా మారాయి.

జాతీయస్థాయిలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి తాజాగా డీఎల్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు పార్టీలోనూ.. బయటా చర్చనీయాంశంగా మారాయి.

తానింకా వైఎసీలోనే ఉన్నానని... వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన డీఎల్.. జనవరి 3 తర్వాత వైఎస్ వివేకానంద హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పారు. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ విచారణ ఊహించని మలుపు తిరుగుతుందన్న ఆయన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

'వివేకా హత్య కేసులో ఉన్న పెద్దలు ఎవరు? వారి చేతులు మారిన రూ.60-70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలాంటి ఎన్నో విషయాలు బయటకు రావొచ్చు' అంటూ తన అంచనాను వెల్లడించటం ద్వారా అందరిని ఉలిక్కిపడేలా చేశారు. తాను అనుకున్న మాటను బయటకు చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడని డీఎల్.. తాజాగా జగన్ సర్కారు మీద తీవ్ర విమర్శలుచేయటంతో పాటు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన స్నేహితుడు కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు తాను చాలా ఆనందపడ్డానని. కానీ ఇంత అవినీతికి పాల్పడతారని మాత్రం తన జీవితంలోనే అనుకోలేదన్న డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టిన రోజున ఆయన ప్రెస్ మీట్ పెట్టి తమ అధినాయకుడి మీద చేసిన విమర్శలు.. ఆరోపణలు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. సంచలనాల డీఎల్ జగన్ ఇమేజ్ ను తాజా ప్రెస్ మీట్ తో భారీగా డ్యామేజ్ చేశారన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.