Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రజలు ఓడిపోయారా?

By:  Tupaki Desk   |   1 Dec 2021 5:30 PM GMT
ఏపీలో ప్రజలు ఓడిపోయారా?
X
డీఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ కు కొరకరాని కొయ్యలా మారారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సమయం దొరికినప్పుల్లా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. సొంత ప్రభుత్వంపై ఆయన ఒంటికాలి మీద లేస్తున్నారు. నవరత్నాల పేరుతో పథకాలు పెట్టి లబ్ధిదారులను ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. ఆర్థికాభివృద్ధి చూస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసేలా ఉందని రవీంద్రారెడ్డి హెచ్చరించారు. ఓట్ల కోసం వెళితే ప్రజలు తిరగబడి కొడతారని విరుచుకుపడ్డారు. ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెట్టి ఆయన పేరు చెడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభయహస్తం పథకానికి జగన్ తూట్లు పొడిచారని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శలు గుప్పించారు. జగన్‌ పాలనలో ప్రజలు ఓడిపోయారని, కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందని ఆరోపించారు.

గృహ నిర్మాణ పథకంలో 10 వేలు కట్టకుంటే పెన్షన్‌ తీసేస్తామనడం సరికాదన్నారు. గ్రామాల్లో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు వచ్చేలా ఉన్నాయని, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ చెప్పిందానికంతా అధికారులు తల ఊపడం చూస్తూంటే వారు ఇంతలా దిగజారడం ఎందుకని ప్రశ్నించారు. ఇందతా చూసి రాష్ట్రంలో ఏ ఒక్కరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. ప్రభుత్వం అందించే డబ్బు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని తెలిపారు. వచ్చే రెండున్నరేళ్లలోనైనా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు. అవినీతి వల్లే చంద్రబాబు ఓడిపోయారని, ఇప్పుడున్న అవినీతి పేద ప్రజలను తినేస్తుందని విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని రవీంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

రవీంద్రారెడ్డి ఏపీ రాజకీయాల్లో చాలా సీనియర్. ముఖ్యంగా చెప్పాలంటే కడప జిల్లాలో వైఎస్‌ఆర్ సమకాలీకుడు. వైఎస్‌ఆర్ తో పాటు కాంగ్రెస్ కోసం కష్టపడ్డారు. దశాబ్దాల కాలం కాంగ్రెస్ లో ఉన్నారు. మైదుకూరు నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న రవీంద్రారెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెరపైకి వచ్చారు. అప్పట్లో ఆయన టీడీపీలో చేరుతారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి రఘురామరెడ్డి వైసీపీలో చేరారు. అందువల్ల ఆయన టీడీపీలో చేరడం ఖాయమైందని అందరూ అనుకున్నారు. అందరి అభిప్రాయాలను తలకిందులు చేస్తే అనూహ్యంగా వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయన రఘురామరెడ్డికి మద్దతుగా నిలిచారు. ఏమైందో ఏమోగాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చెవిలో జోరీగలాగా తయారయ్యారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.