Begin typing your search above and press return to search.

టీడీపీలోకి మాజీ మంత్రి డీఎల్

By:  Tupaki Desk   |   29 Sep 2017 4:32 AM GMT
టీడీపీలోకి మాజీ మంత్రి డీఎల్
X
కడప జిల్లా టీడీపీ నేత - మొన్నటి ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలున్నాయని వినిపిస్తోంది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డిని టీడీపీలోకి తేవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మైదుకూరు నుంచి బరిలో దింపే వ్యూహంతో సుధాకర్ నుంచి ఎన్నికల రేసు నుంచి చంద్రబాబు తెలివిగా తప్పించారని వినిపిస్తోంది.

డీఎల్ రవీంద్ర రెడ్డికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కడప జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు కూడా అయిన సుధాకర్ యాదవ్‌ ను టీటీడీ చైర్మన్‌ గా నియమించడం ద్వారా ఆయన్ను మైదుకూరు ఇన్‌ చార్జ్ పోస్టు నుంచి తప్పించి డీఎల్‌ కు అక్కడ అవకాశం ఇవ్వనున్నారట. మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయిన సుధాకర్ వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తారన్న నమ్మకం లేదని.. అయితే.. ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని ఎన్నికల సమయంలో యనమల కోరే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు టీటీడీ పదవి ఇప్పించి పంపిచారని వినిపిస్తోంది.

2014 ఎన్నికల్లో సుధాకర్ టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు డీఎల్‌ మద్దతు తెలిపారు. సుధాకర్ ఓటిమి పాలైన తరువాత ఇద్దరి మధ్య విబేధాలు పెరిగాయి. అనంతరం డీఎల్‌ కూడా చంద్రబాబు విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. చంద్రబాబు పాలనలో అవినీతి అమాంతం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని కూడా చెప్పారు. తాను వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని కూడా చెప్పారు. కానీ... వైసీపీతో ఎక్కడ బెడిసి కొట్టిందో ఏమో కానీ ఆయన ఆ పార్టీలో చేరలేదు. ఇంతలో రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎవరినైనా చేర్చుకునేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు కన్ను డీఎల్ పై పడింది. ఈ క్రమంలోనే మైదుకూరు రేసు నుంచి సుధాకర్ ను తప్పించారని తెలుస్తోంది. త్వరలో డీఎల్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని, ఇప్పటికే చర్చలు జరిగాయని సమాచారం.