Begin typing your search above and press return to search.

వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్?

By:  Tupaki Desk   |   20 July 2017 5:31 AM GMT
వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్?
X
ఏపీలో మోడుబారిన కాంగ్రెస్ చెట్టుకు మళ్లీ చిగురు వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించకపోవడంతో ఆ చెట్టుపై ఉంటున్న పిట్టలన్నీ ఎగిరిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే అటూఇటూ చూస్తూ సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాయి. త్వరలో ఏపీ కాంగ్రెస్ కు భారీ షాక్ లు తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి వైసీపీలోకి చేరడం దాదాపు ఖరారైపోయిందని తెలుస్తోంది.

కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత - మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. డీఎల్ కూడా కొద్ది నెలల కిందట స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు కూడా. ఒక వెబ్‌ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జగన్ నుంచి ఆహ్వానం వస్తే వైసీపీలో చేరుతానని చెప్పారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ వివేకాకు ఆయన మద్దతు ఇచ్చారు.

అయితే.. డీఎల్ చేరిక ఎప్పుడన్న విషయంలో మొన్నటవరవకు కొంత స్పష్టత లేకుండా ఉండేది. కానీ... అక్టోబర్‌ 27 నుంచి జగన్‌ పాదయాత్ర మొదలుపెడుతుండడం... అది కూడా కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచే ప్రారంభం కానుండడంతో అంతకుముందు కానీ.. అదే రోజున కానీ డీఎల్ చేరిక ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు జగన్ పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వైసీపీలో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. పాదయాత్ర ఆర్నెళ్లు సాగనుండడంతో 2018 మార్చి నాటికి పాదయాత్ర బలం... సీనియర్ల చేరికలతో మరింత బలం సమకూర్చుకుని ఎన్నికలకు వైసీపీ సిద్ధం కానుంది.