Begin typing your search above and press return to search.

లాభాల పంట పండిస్తున్న డీమార్ట్.. మొదటి 3 నెలల్లో భారీ ఆదాయం

By:  Tupaki Desk   |   3 July 2022 2:53 AM GMT
లాభాల పంట పండిస్తున్న డీమార్ట్.. మొదటి 3 నెలల్లో భారీ ఆదాయం
X
కొన్నేళ్ల క్రితం చిన్న చిన్న టౌన్లలో హోల్ సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం లాంటి మాటలు వినిపించేవి. ఈ మాటల్ని అక్షర సత్యమన్నట్లు చేయటమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన డీమార్ట్.. ఇప్పుడు తిరుగులేని సూపర్ మార్కెట్ల చైన్ గా అవతరించటమే కాదు.. దాని యజమాని రాధాకృష్ణ దమానీకి.. ఆయన కుటుంబాన్ని కుబేరులుగా మార్చింది. ఈ ఇమేజ్ తో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన వారికి.. వేలాది కోట్ల సంపదను తెచ్చి పెట్టింది. కట్ చేస్తే.. జూన్ తో ముగిసిన మొదటి మూడు నెలల ఆదాయానికి సంబంధించిన లెక్కల్ని డీమార్ట్ వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లుగా డీమార్ట్ పేర్కొంది. తొలి మూడు నెలల్లో (ఏప్రిల్.. మే.. జూన్) రూ.9806.89 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లుగా పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5031.75 కోట్లు మాత్రమే. అంటే.. గత ఏడాది తొలి త్రైమాసిక ఆదాయంతో పోలిస్తే దగ్గర దగ్గర రెట్టింపుగా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో అవెన్యూ సూపర్ మార్ట్స్ పేర్కొంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే.. కరోనా ఏడాది (2020) తొలి త్రైమాసిక ఆదాయం రూ.5780.53 కోట్లుగా ఉంది. అలా చూసుకున్నా.. గడిచిన రెండేళ్లలో డీమార్ట్ ఆదాయం భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. డీమార్ట్ భారీ ఆదాయానికి కారణం.. అమ్మకాలు భారీగా పెరగటంతో పాటు.. ఖర్చులు నియంత్రణలో ఉండటంగా చెప్పొచ్చు. మిగిలిన సూపర్ మార్కెట్ల మాదిరి కాకుండా.. తాను సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసే ప్రతి చోట సొంత భవనాన్ని ఏర్పాటు చేయటం ద్వారా.. స్థిర ఖర్చులే ఎక్కువన్నట్లుగా ఉండటంతోపాటు.. సంస్థ భూములు భారీ ఆస్తులుగా మారుతున్న పరిస్థితి.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో (ఏపీ.. తెలంగాణ.. మహారాష్ట్ర.. గుజరాత్.. మధ్యప్రదేశ్.. కర్ణాటక.. ఛత్తీస్ గఢ్.. ఢిల్లీ.. తమిళనాడు.. పంజాబ్.. రాజస్థాన్) 294 స్టోర్లు ఉండగా.. అవన్నీ కూడా సొంత భవనాల్లోనే సాగటం గమనార్హం. గడిచిన కొద్దిరోజులుగా డీమార్ట్ షేరు ధర తగ్గుతోంది. తాజా ఫలితాల నేపథ్యంలో పుంజుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.