Begin typing your search above and press return to search.

క‌రుణ కుటుంబంలో క‌ల‌హాలు షురూ!

By:  Tupaki Desk   |   9 Aug 2018 5:04 AM GMT
క‌రుణ కుటుంబంలో క‌ల‌హాలు షురూ!
X
క‌లిసే ఉన్నా.. అత‌క‌ని మ‌న‌సులు మ‌ధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాజాగా డీఎంకేలో అలాంటి ప‌రిస్థితే నెలకొంది. డీఎంకే సామ్రాట్టు క‌రుణానిధికి మొత్తం ముగ్గురు భార్య‌ల‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురు భార్య‌ల సంతానం పైకి క‌లిసే ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రి దారి వారిద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వారు. అయితే.. క‌రుణ అనే దారం వారిని క‌లిసి ఉండేలా చేయ‌ట‌మే కాదు.. డీఎంకేకు వారో పూల‌మాల‌లా ఉండేవారు.

ఇప్పుడు దారం తెగింది. పువ్వులు చెల్లాచెదురు అయ్యే ప‌రిస్థితి. క‌రుణ రాజ‌కీయ వార‌సుడిగా స్టాలిన్ ను గ‌తంలోనే డిసైడ్ అయినా.. ఆ పీఠం కోసం మ‌న‌సు ప‌డ్డ ఆళ‌గిరి.. తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయారు. క‌రుణ బ‌తికి ఉన్నంత కాలం.. పార్టీని న‌డిపేది స్టాలినే అయినా.. త‌లైవా క‌రుణ పేరిటే ప‌నులు చ‌క్క‌బెట్టేవారు. దీంతో.. ఇష్టం ఉన్నా.. తండ్రికి ఎదురు చెప్ప‌లేక ఆళ‌గిరి అండ్ కో కామ్ గా ఉండేంది.

త‌న రాజ‌కీయ వార‌సుడిగా స్టాలిన్ నియామ‌కాన్ని ఆళ‌గిరి తీవ్రంగా వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. డీఎంకే ర‌థ‌సార‌ధిగా క‌రుణ‌ను త‌ప్పించి తాను మ‌రెవ్వ‌రినీ చూడ‌లేన‌ని ఆయ‌న చెప్పేవారు. ఆళ‌గిరి మ‌న‌సు తెలిసిన క‌రుణ ఆయ‌న్ను రాష్ట్ర రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచి ఢిల్లీకి ప‌రిమితం చేసేవారు. ఇష్టం లేకున్నా తండ్రి మాట కాద‌న‌లేక ఉన్న ఆయ‌న‌.. 2014 నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు.

త‌న‌కు విధేయులుగా ఉన్న వారిని వేర్వేరు పార్టీల్లో చేరేందుకు ఆళ‌గిరి ఓకే చెప్ప‌టంతో.. వారంతా డీఎంకే నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టం ద్వారా పార్టీ అధినాయ‌క‌త్వంపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అయినా.. ఆ విష‌యానికి క‌రుణ ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. తండ్రి మీద ఉన్న గుర్రుతో ఆళ‌గిరి ఉండ‌టం.. అత‌డి తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన క‌రుణ‌.. ఆళ‌గిరిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. ఈ కార‌ణం కూడా 2016లొ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే ఓట‌మికి కార‌ణంగా చెప్పాలి. ద‌క్షిణాది జిల్లాల్లో మంచి ప‌ట్టు ఉన్న ఆళ‌గిరి పుణ్య‌మా అని జ‌య మ‌రోసారి అధికారాన్ని చేప‌ట్టే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నార‌ని చెబుతారు.

ఇదిలా ఉంటే.. క‌రుణ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆల‌గిరి పావులు క‌ద‌ప‌టం షురూ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు స్టాలిన్ కు స‌న్నిహితంగా ఉండే ప‌లువురు గ‌తంలో ఆళ‌గిరి విధేయులుగా చెబుతారు. దీంతో.. ఇప్పుడు వారు కానీ స్టాలిన్ కు హ్యాండిస్తే ప‌రిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయ‌ని చెబుతున్నారు. పార్టీలో కీల‌క‌మైన కోశాధికారి.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అన్బ‌ళ‌గ‌న్ లు ఇద్ద‌రూ స్టాలిన్ వైపే ఉన్న‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్తులో ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స్టాలిన్ న‌మ్మ‌కున్నోళ్లంతా ఒక‌ప్పుడు ఆళ‌గిరి స‌న్నిహితులు కావ‌టం.. పెద్దాయ‌న లేని నేప‌థ్యంలో స్టాలిన్ కు షాకిచ్చేలా ఆళ‌గిరి చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రానున్న రోజుల్లో డీఎంకే పార్టీలో చీలిక‌ల‌కు ఎక్కువ అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.