Begin typing your search above and press return to search.

ఆవేశపడి అడ్డంగా బుక్ అయిన డీఎంకే

By:  Tupaki Desk   |   18 Feb 2017 9:52 AM GMT
ఆవేశపడి అడ్డంగా బుక్ అయిన డీఎంకే
X
ఆవేశం మంచిదే. కానీ.. అందుకు తగిన సమయం.. సందర్భం చాలా అవసరం. ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకొని వచ్చారో కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం తమిళనాడు విపక్షం డీఎంకే అడ్డంగాబుక్ అయ్యిందనే చెప్పాలి. పళనిస్వామి ప్రభుత్వ బలనిరూపణ కోసం శనివారం అసెంబ్లీని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. బలనిరూపణ పరీక్షకు రహస్య బ్యాలెట్ ను నిర్వహించాలన్న డిమాండ్ చేయటం ద్వారా.. పళని వర్గాన్ని డిఫెన్స్ లో పడేయాలని భావించారు. ఎందుకంటే.. తమ డిమాండ్ కు స్పీకర్ ఒప్పుకునే అవకాశం లేని నేపథ్యంలో.. తమ న్యాయసమ్మతమైన డిమాండ్ ను స్పీకర్ అంగీకరించకుండా.. విచక్షణ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శను ప్రచారం చేయాలని భావించింది.

ఇంతవరకూ అంతా అనుకున్నట్లే జరిగినా.. ప్లాన్ ను అమలు చేసే విషయంలో డీఎంకే అడ్డంగా బుక్ అయ్యింది. రహస్య ఓటింగ్ కు స్పీకర్ ధనపాల్ అంగీకరించకుండా.. సభలోని సభ్యుల్ని ఆరు డివిజన్లుగా చేసి.. డివిజన్ల వారీగా ఎన్నిక నిర్వహించటం మొదలు పెట్టారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన డీఎంకే వర్గం.. హద్దులు దాటినఆగ్రహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అప్పటి వరకూ పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా స్పీకర్ వ్యవహరించారన్న భావన స్థానే.. డీఎంకే సభ్యులు ఆరాచకం హైలెట్ అయ్యింది.

మొదట అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ టెలికాస్ట్ చేయకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ.. డీఎంకే ను డ్యామేజ్ చేసేందుకు అవసరమైన పరిణామాలు సభలో చోటు చేసుకోవటంతో.. డీఎంకే నేతలు రచ్చరచ్చ చేసిన దృశ్యాల్ని విడుదల చేశారు. అంతేకాదు.. మొదటిసారి వాయిదా పడిన తర్వాత.. తిరిగి ప్రారంభమైన సభను లైవ్ టెలికాస్ట్ చేశారు. డీఎంకే ఎమ్మెల్యేలు సభలో ఎంత ఆరాచకం సృష్టించారన్న భావన వచ్చిందన్న సమయంలోనే.. స్పీకర్ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవటం గమనార్హం. ఇది జరిగిన కాసేపటికే..డీఎంకే సభ్యుల్ని మూకుమ్మడిగా సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. అతిగా ఆవేశపడి డీఎంకే సభ్యులు అడ్డంగా బుక్ అయ్యారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/