Begin typing your search above and press return to search.

తిట్లు తిన‌డంలో బాబుది జాతీయ స్థాయి

By:  Tupaki Desk   |   12 Nov 2018 6:25 AM GMT
తిట్లు తిన‌డంలో బాబుది జాతీయ స్థాయి
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు కాంగ్రెస్ నేతృత్వంలో కూట‌మి జ‌ట్టుక‌ట్ట‌డానికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామం రాష్ట్ర వ్యాప్తంగానే దేశ‌వ్యాప్తంగా కూడా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. తాజాగా, వివిధ పార్టీల నేత‌లు బాబు తీరుపై స్పందించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి కట్టడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి అన్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తో చంద్రబాబు చేతులు కలపడం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. ప్రతీసారి రంగులు మార్చే చంద్రబాబు విశ్వసనీయ వ్యక్తి కాదని పేర్కొన్నారు. మరోవైపు, చంద్రబాబు కేవలం వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే కూటమి అంటూ తిరుగుతున్నారని తమిళనాడు శాఖ బీజేపీ అధ్యక్షుడు సౌందర్‌ రాజన్ ఆరోపించారు. చంద్రబాబుకు ప్రస్తుతం నరేంద్రమోడీ భయం పట్టుకొన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ...తన పంథాను మార్చుకోవడం అంటే తమను నమ్మిన ప్రజలను వంచించడమే అని స్పష్టం చేశారు.

కాగా, బీజీపీకి వ్యతిరేకంగా ఏర్పాటుచేస్తున్న కాంగ్రెస్ కూటమిలో చేరని వారు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు భావిస్తామని ఇటీవల చంద్రబాబు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అన్నారు. రెండు కూటములు పూర్తిగా విఫలమైనందున ప్రజల పక్షాన నిలబడే పార్టీలు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే నంబర్‌ వన్‌ గా పేరు గడించారని అన్నారు. దేశంలోని పలు పార్టీలు అధికారం కోసం సిద్ధాంతాలను గాలికి వదిలేసి ప్రత్యర్థి పార్టీలను గద్దె దించడమే లక్ష్యంగా కూటములను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. సిద్ధాంతాలను వదిలిపెట్టి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల ప్రస్తుతం వామపక్ష పార్టీలు సీట్ల కోసం అడుక్కునే దుస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్‌ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ప్రజావ్యతిరేక విధానాలను బీజేపీ కూడా కొనసాగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని - అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకునేవారు అన్ని విషయాల్లో తమ వైఖరిని వెల్లడిస్తూ కనీస ఉమ్మడి ప్రణాళికలను ప్రకటించకపోవడం తప్పని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కేవలం సీట్ల కోసం కాకుండా ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటడానికి తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.