Begin typing your search above and press return to search.

డీఎంకే గెలుపుకు ఇదే నిదర్శనమా ?

By:  Tupaki Desk   |   3 April 2021 5:30 AM GMT
డీఎంకే గెలుపుకు ఇదే నిదర్శనమా ?
X
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందనేందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని జనాల్లో చర్చ పెరిగిపోతోంది. హఠాత్తుగా శుక్రవారం ఉదయం నుండి డీఎంకే చీఫ్ స్టాలిన్ కూతురు, అల్లుడు ఇళ్ళు, కార్యాలయాలతో పాటు గెస్ట్ హౌస్ లో ఐటి సోదాలు జరిగాయి. వీళ్ళు మాత్రమే కాదు చివరకు డీఎంకే అభ్యర్ధులను కూడా ఐటి ఉన్నతాధికారులు వదిలిపెట్టలేదు. కనీసం ఏడుగురు అభ్యర్ధులు లేదా వాళ్ళ సోదరుల ఇళ్ళపై 14 చోట్ల ఐటి దాడులు జరిగాయి.

ఆదాయపు పన్ను అధికారుల దాడులు జరగటంలో ఆశ్చర్యపోవాల్సిందేమీలేదు. కానీ మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రత్యేకించి డీఎంకే చీఫ్+అభ్యర్ధులు లేదా వాళ్ళ దగ్గరి బంధువులపైన మాత్రమే దాడులు జరపటం రాజకీయ కక్షసాధింపు చర్యలుగానే జనాలు చెప్పుకుంటున్నారు. మొదటినుండి కూడా డీఎంకేనే గెలుస్తుందని ప్రీపోల్ సర్వేలన్నీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి.

ఎలాగైనా స్టాలిన్ సైన్యం మనోస్ధైర్యాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఐటి దాడుల కారణంగా డీఎంకే అభ్యర్ధులపై జనాల్లో మరింతగా సానుభూతి పెరిగే అవకాశాలున్నాయి. అసలే కేంద్రం మీద ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఉసిగొలుపుతున్నాయని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇలాంటి నేపధ్యంలోనే డీఎంకే అభ్యర్ధుల ఇళ్ళపై ఐటి దాడుల ప్రభావం అన్నాడీఎంకే, బీజేపీ కూటమి గెలుపుపై నెగిటివ్ ప్రభావం పడటం ఖాయమంటున్నారు. మొత్తం మీద దర్యాప్తు సంస్ధలను కేంద్రంలోని బీజేపీ ఎలా ఉపయోగించుకుంటోందనేందుకు ఇపుడు జరుగుతున్న ఐటి దాడులే తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేవని అనుకున్నపుడే అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతుంది. తాజాగా జరుగుతున్న ఐటి దాడులు డీఎంకే గెలుపును సూచిస్తున్నాయి.