Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ జైలుశిక్ష‌లో కీల‌కం అత‌డే

By:  Tupaki Desk   |   6 April 2018 4:38 AM GMT
స‌ల్మాన్ జైలుశిక్ష‌లో కీల‌కం అత‌డే
X
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు కృష్ణ జింక‌ల్ని వేటాడిన కేసులో జైలుశిక్ష ప‌డ‌టం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి పాత విష‌యం. రెండేళ్లు అని మొద‌ట అనుకున్నా.. కాదు ఐదేళ్లు అంటూ న్యాయ‌మూర్తి తీర్పు విన్నంత‌నే అంత పెద్ద స‌ల్మాన్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అత‌డ్ని ఓదార్చేందుకు అత‌గాడి ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు తెగ ప్ర‌య‌త్నించారు.

ప్ర‌స్తుతం జోధ్‌పూర్ జైల్లో ఖైదీ నంబ‌రు 106గా సేద తీరుతున్న స‌ల్మాన్ కు.. ఇంత భారీ శిక్ష ప‌డేందుకు కార‌ణం ఒక హైద‌రాబాదీ ఇచ్చిన నివేదిక కావ‌టం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ లోని సెంట‌ర్ ఫ‌ర్ డీఎన్ ఏ ఫింగ‌ర్ ప్రింటింగ్ అండ్ డ‌యాగ్న‌స్టిక్స్ ల్యాబ్ కు చెందిన సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త జీవీ రావు (జి. వెంక‌టేశ్వ‌ర‌రావు) ఇచ్చిన నివేదిక స‌ల్మాన్ ను జైలుకు వెళ్లేలా చేసింద‌న‌టంలో ఎలాంటి సందేమం లేదు.

స‌ల్మాన్ వేట కార‌ణంగా మ‌ర‌ణించింది మాములు జింకా? అరుదైన జాతికి చెందిన కృష్ణ జింక అన్న విష‌యాన్ని తేల్చింది జీవీ రావే. ఈ కేసుకు సంబంధించిన కీల‌క డీఎన్ ఏ టెస్ట్ ను చేయాల్సిందిగా రాజ‌స్థాన్ అట‌వీ శాఖాధికారులు కోర‌టంతో రంగంలోకి దిగిన జీవీ రావు.. త‌న విశేష కృషితో కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. దాదాపు ఆర్నెల్ల క‌ష్టం.. తాజాగా స‌ల్మాన్ జైలుశిక్ష విధించ‌టంలో కీల‌కంగా మారింది.

కృష్ణ జింక‌ల్ని వేటాడిన కేసు దాదాపు 20 ఏళ్ల కింద‌టిది. ఆ స‌మ‌యంలో ఇప్పుడున్నంత సాంకేతిక‌త లేదు. అందునా.. స‌ల్మాన్ వేటాడిన కృష్ణ జింక‌ను మ‌ట్టిలో పూడ్చేసి.. అంతిమ సంస్కారాలు పూర్తి అయిన కొద్ది కాలానికి దాన్ని వెలికి తీసి.. దాని అవ‌శేషాల్ని హైద‌రాబాద్ ల్యాబ్‌కు పంపారు. ఆ కేసు జీవీ రావు చేతికి వ‌చ్చింది. అప్ప‌ట్లో సీడీఎఫ్ డీ లో ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌కు ఈ కేసును అప్ప‌గించారు. ఒక ప్ర‌ముఖ న‌టుడికి చెందిన ఉదంతం కావ‌టం.. దేశ వ్యాప్తంగా అప్ప‌టికే సంచ‌ల‌నంగా మారిన ఈ కేసును సీరియ‌స్ గా తీసుకున్న జీవీ రావు.. త‌న‌తో పాటు మ‌రో ముగ్గురు సిబ్బంది క‌లిసి దాదాపు ఆర్నెల్ల‌పాటు తీవ్రంగా శ్ర‌మించారు.

జంతువుల కోసం డీఎన్ ఏ నిర్వ‌హించే టెక్నాల‌జీ అప్ప‌ట్లో లేక‌పోవ‌టంతో.. ఈ కేసు కోసం ప్ర‌త్యేక టెక్నాల‌జీని ఉప‌యోగించారు. పాలిమ‌రైజ్ చెయిన్ రియాక్ష‌న్ (పీసీఆర్‌) అనే టెక్నాల‌జీతో జింక ఎముక‌లు.. చ‌ర్మాన్ని శుభ్రం చేసి వాటిని సుదీర్ఘంగా ప‌రీక్ష‌లు జ‌రిపిన త‌ర్వాత వేట‌లో చ‌నిపోయింది అరుదైన జాతికి చెందిన కృష్ణ జింక‌గా తేల్చి నివేదిక ఇచ్చారు. ఇదే.. ఇప్పుడు స‌ల్మాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష ప‌డేలా చేసింది. ఈ కేసులో స‌రైన తీర్పు వ‌చ్చింద‌ని జీవీ రావు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.