Begin typing your search above and press return to search.

బీజేపీకే ఆప్షన్లు ఎక్కువున్నాయా ?

By:  Tupaki Desk   |   13 Jan 2022 5:58 AM GMT
బీజేపీకే ఆప్షన్లు ఎక్కువున్నాయా ?
X
వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే విషయంలో పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్నా బీజేపీకే ఎక్కువ ఆప్షన్లున్నాయి. పవన్ కు తాజాగా చంద్రబాబునాయుడు పంపిన లవ్ ప్రపోజల్ తర్వాత పార్టీలకున్న పొత్తుల అవకాశాలపై బాగా చర్చలు జరుగుతున్నాయి. అధికార వైసీపీకి పొత్తుల గురించి చింతలేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అనే ధీమాలో ఉన్నారు కాబట్టి పొత్తుల గురించి ఆలోచించటంలేదు.

ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారానికి రావాల్సిన అవసరం నూటికి వెయ్యిశాతం చంద్రబాబుకే ఉంది. టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి పెద్దగా వచ్చేది లేదు పోయేదీ లేదు. ఇప్పటికే 72 ఏళ్ళ వయసులో ఉన్న చంద్రబాబుకి అధికారంలోకి రావటం ఎంత అవసరమో కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. ఏ కారణం వల్లయినా అధికారం దక్కకపోతే టీడీపీ పరిస్ధితి ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే.

అందుకనే చంద్రబాబు పొత్తుల గురించి అంతలా పాకులాడుతున్నారు. ఇక మిత్రపక్షాల సంగతి చూస్తే పవన్ కున్న అవకాశం ఏమిటంటే ఉంటే బీజేపీతో కంటిన్యు అవ్వాలి. లేకపోతే విడిపోయి టీడీపీతో జతకట్టాలి. మూడో ఆప్షన్ కూడా మరోటుంది. అదేమిటంటే బీజేపీ, టీడీపీలను కలపటం. అప్పుడు 2014 కాంబినేషన్ రిపీటవుతుంది. అయితే బీజేపీ, టీడీపీలను కలపటం పవన్ చేతిలో లేదు. అందుకు బీజేపీ అగ్రనేతలు అంగీకరించాలి.

ఇదే సమయంలో బీజేపీకి మూడు ఆప్షన్లున్నాయి. ఒకటి పవన్ తోనే కంటిన్యు అవ్వటం. రెండోది చంద్రబాబుతో కూడా కలవటం. మూడోది వైసీపీతో పొత్తు పెట్టుకోవటం. వైసీపీతో పొత్తంటే ముందు జగన్ అంగీకరించాలి. జగన్ అంగీకరించాలంటే ఏపీ ప్రయోజనాల విషయంలో షరతులకు కేంద్రంలోని పెద్దలు అంగీకరించాలి. అలా కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ కే నష్టం.

సో అందుబాటులో ఉన్న ఆప్షన్ల ప్రకారం వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటే ముందు ప్రత్యేకహోదా, రైల్వేజోన్, పోలవరం సవరించిన అంచనాలు, వైజాగ్ స్టీల్ వ్యవహారాలను తేల్చాలి. ఒకవేళ కేంద్రం గనుక పై అంశాల్లో సానుకూలంగా స్పందించి వైసీపీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఈ రెండుపార్టీలు క్లీన్ స్వీప్ చేయటం ఖాయం. వైసీపీ పుణ్యమాని బీజేపీ ఓ పదిసీట్లలో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఎవరితో కలుస్తారనే అంశం చాలా ఆసక్తిగా మారుతోంది. మరి ఫైనల్ రిజల్టు ఎలాగుంటుందో చూడాలి.