Begin typing your search above and press return to search.

కోర్టులు చెప్తేనే ప్ర‌భుత్వాలు వింటాయా?

By:  Tupaki Desk   |   15 Dec 2021 5:32 PM GMT
కోర్టులు చెప్తేనే ప్ర‌భుత్వాలు వింటాయా?
X
ప్ర‌జ‌ల నుంచి విప‌క్షాల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం. దానిపై కొంత‌మంది కోర్టును ఆశ్ర‌యించ‌డం. అన్ని అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పిటిష‌న్ల‌పై విచారించిన కోర్టు.. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కొట్టేయ‌డం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న‌ది ఇదే. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోని ప్ర‌భుత్వాలు నియంతృత్వ‌పు ధోర‌ణితో నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయ‌ని, వాటిని కోర్టులు అడ్డుకుంటున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌లు చెప్తే విన‌ని ప్ర‌భుత్వాల‌పై కోర్టు మొట్టికాయ‌లు వేస్తున్నాయ‌ని నిపుణులు అంటున్నారు.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ తీసుకొచ్చిన జీవో 35ను హై కోర్టు కొట్టేసింది. సినిమా టికెట్ల రేట్ల విష‌యంలో పారద‌ర్శ‌క‌త అవ‌స‌ర‌మ‌ని, ఏ సినిమాకైనా ఒక‌టే టికెట్ ధ‌ర ఉండాల‌ని ప్ర‌భుత్వం ఈ జీవోని జారీ చేసింది. సినీ ప్ర‌ముఖ‌ల నుంచి అభ్యంత‌రాలు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు. థియేట‌ర్ యాజ‌మాన్యాలు ఆందోళ‌న చేసినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. తీరా ఇప్పుడు టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించే హ‌క్కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదంటూ సినిమా థియేట‌ర్లు హై కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు కూడా వాళ్ల‌కు అనుకూలంగానే తీర్పునిస్తూ జీవోను కొట్టేసింది. మునుప‌టి లాగే టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించుకునే సౌల‌భ్యాన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌ను క‌ట్ట‌బెట్టింది. ఇప్ప‌టికే చాలా విష‌యాల్లో వైసీపీ ప్ర‌భుత్వానికి కోర్టులో చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే.

ఇక తెలంగాణ‌లో ఈ మ‌ధ్య ప్ర‌భుత్వానివి అనాలోచిత నిర్ణ‌యాలు అంటూ హై కోర్టు మెట్లు ఎక్కే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో పార‌ద‌ర్శ‌క‌త స‌హా చాలా విష‌యాల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానిపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం విష‌యంలోనూ ఓ నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం.. కోర్టు జోక్యంతో వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. ప‌బ్లిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ అధికారులు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద స‌మాచారాన్ని ఇచ్చేట‌ప్పుడు ఉన్న‌తాధికారుల అనుమ‌తి తీసుకోవాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఇది స‌మాచార చ‌ట్టానికి తూట్లు పొడిచేలా ఉంద‌ని భావించిన కొంత‌మంది హై కోర్టుని ఆశ్ర‌యించారు. కోర్టులో ఎలాగైనా ఎదురు దెబ్బ త‌గ‌ల‌ద‌ని భావించిన ప్ర‌భుత్వం ఆ స‌ర్క్యుల‌ర్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టులు రంగ ప్ర‌వేశం చేస్తే త‌ప్ప ప్ర‌భుత్వాలు త‌మ ప‌ని స‌రిగ్గా చేయ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.