Begin typing your search above and press return to search.

కుంభమేళా భక్తులు కరోనాను ప్రసాదంలా పంచుతారేమో!

By:  Tupaki Desk   |   17 April 2021 4:30 PM GMT
కుంభమేళా భక్తులు కరోనాను ప్రసాదంలా పంచుతారేమో!
X
ఓ వైపు దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. మరోవైపు అదే రీతిలో కరోనా వైరస్ మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌‌‌లో మహమ్మారి విజృంభణ మాములుగా లేదు. గత మూడు రోజులుగా ప్రతిరోజు కూడా రోజుకు 2 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాగే కొనసాగితే దేశంలో కరోనా భారిన పడని వారంటూ ఎవరూ ఉండరు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో కుంభమేళాను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. లక్షలాది మంది గుమిగూడుతున్నందున మేళాను ఎందుకు నిర్వహించారంటూ విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ స్పందించారు. కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌ లో కుంభమేళా నిర్వహిస్తుండటంపై ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ అసహనం వ్యక్తంచేశారు. కుంభమేళాకు వెళ్లి వచ్చిన భక్తులు అందరికీ ప్రసాదం మాదిరిగా కరోనాను పంచుతారేమోనని ఆమె అన్నారు. కుంభమేళాకు పోయొచ్చిన వారి నుంచి మిగతావారికి కరోనా సోకకుండా ఉండాలంటే వారిని క్వారంటైన్‌ లో ఉంచాలని సూచించారు. కుంభమేళా నుంచి తిరిగొచ్చిన వారందరూ విధిగా హోం క్వారెంటైన్ కావాలని విజ్ఞప్తి చేశారు. ముంబైలో కూడా కుంభమేళా నుంచి తిరిగొచ్చిన వారందర్నీ క్వారంటైన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 95 శాతం మంది ముంబై ప్రజలు కోవిడ్ రూల్స్‌ను విధిగా పాటిస్తున్నారని, మిగితా 5 శాతం మందితోనే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తేనే బాగుంటుందని కిశోర్ పెడ్నేకర్ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు